Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల‌కు అమిత్ షా ఎందుకు లేఖ రాస్తాడు?

By:  Tupaki Desk   |   12 Feb 2019 6:08 AM GMT
ఆంధ్రోళ్ల‌కు అమిత్ షా ఎందుకు లేఖ రాస్తాడు?
X
మిమ్మ‌ల్ని దారుణంగా మోసం చేశాడో పెద్ద మ‌నిషి. ఆ పెద్ద మ‌నిషి మీ ఇంటి ద‌గ్గ‌ర‌కో.. మీ బంధువుల వ‌ద్ద‌కో.. మీ మిత్రుల వ‌ద్ద‌కో వెళ్లి.. నేనెంత సాయం చేశానో తెలుసా? అనే మాట‌లు ఎందుకు చెబుతాడు? ఎలా చెబుతాడు? అయితే.. ఆ వ్య‌క్తి చేత‌కానిత‌నం మీద న‌మ్మ‌కం కావొచ్చు. తానేం చేసినా.. చెప్పినా.. ఎవ‌రినైనా బుట్ట‌లో వేసుకునే స‌త్తా ఉంద‌న్న న‌మ్మ‌కం కావొచ్చు. తానేం చెప్పినా.. చేసినా.. త‌న త‌ప్పుల చిట్టా బ‌య‌ట‌పెట్టి.. తాను త‌ల ఎత్తుకునేలా చేసే స‌త్తా లేక‌పోయి ఉండ‌టం. కార‌ణం ఏదైనా ఉండొచ్చు.

తాజాగా ఆంధ్రోళ్ల ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంది. ఆంధ్రోళ్ల‌కు దిమ్మ తిరిగిపోయేలా దెబ్బ కొట్టిన మోడీషాలు.. రెండు రోజుల వ్య‌వ‌ధిలో త‌మ మాట‌ల విన్యాసాన్ని ఆంధ్రోళ్ల ఎదుట ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆదివారం గుంటూరుకు వ‌చ్చిన మోడీ.. ఏపీ ముఖ్య‌మంత్రి మీదా.. ఆయ‌న కుమారుడి మీద తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం.. విమ‌ర్శ‌లు సంధించ‌టం చేశారు.

ఒక దేశ ప్ర‌ధానిగా ఉన్న వ్య‌క్తి.. ఇంత చ‌వుక‌బారుగా మాట్లాడ‌తారా? అంటే.. అది మోడీకి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే ప‌నిగా చెప్పాలి. ఈ దేశాన్ని ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌ధాన‌మంత్రులు పాలించారు. కానీ.. వారెవ‌రూ కూడా స్థానిక రాజ‌కీయ అంశాలు.. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టం.. చౌక‌బారు విమ‌ర్శ‌ల్ని సంధించ‌టం లాంటివి చేసేవారు కాదు. ప్ర‌ధానిగా వారికుండే మ‌ర్యాద చెదిరే ప్ర‌య‌త్నం చేయ‌టానికి సైతం ఇష్ట‌ప‌డేవారు కాదు.

కానీ.. ప్ర‌ధాని కుర్చీలో ఉన్న‌మోడీ తీరు అందుకు భిన్నం. త‌న‌కు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌దు. కోట్లాది మంది ప్ర‌జ‌ల ఎదుట‌.. తాను ప్ర‌ధాన‌మంత్రిని అయ్యాక ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని.. ఢిల్లీకి మించిన రాజ‌ధానిని ఏపీకి నిర్మిస్తామ‌ని చెప్పి.. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో రూ.2500 కోట్లు ఇవ్వ‌టాన్ని గొప్ప‌గా చెప్పుకోవ‌టాన్ని ఏమ‌నాలి? ఎలా చూడాలి?

మోడీ బ‌హిరంగ స‌భ అయ్యిందో లేదో.. సోమ‌వారం అమిత్ షా ఒక బ‌హిరంగ లేఖ‌ను రాశారు. అందులో ఏపీకి తాము చేసిన ప‌నుల జాబితాను ఉటంకించారు. పిల్ల‌ల‌కు పప్పు బెల్లాలు పెట్టిన వాటి గురించి ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. కీల‌క‌మైన మూడు అంశాల మీద మాత్రం నోరు విప్ప‌లేదు. అందులో ఒక‌టి ప్ర‌త్యేక హోదా.. రెండోది విశాఖ‌కు రైల్వే జోన్.. మూడోది ఏపీ రాజ‌ధాని విష‌యంలో వారేం చేశార‌న్న‌ది చెప్ప‌లేదు.

కీల‌క‌మైన ఈ మూడు హామీల్లో దేన్ని చేయ‌ని వారు.. తాము చాలా చేశామ‌ని చెప్పుకునే ధైర్యం ఎక్క‌డిదంటే.. అందుకు కార‌ణంగా ఆంధ్రోళ్ల చేత‌కానిత‌నంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. త‌మ వ‌ద్ద అబ‌ద్ధాలు.. అస‌త్యాలు చెప్పే నేత‌ల్ని.. పార్టీల‌ను.. త‌మ ప్రాంతానికి ఏమీ చేయ‌కుండానే.. చాలా చేశామ‌ని చెప్పుకునే నేత‌ల‌కు కాల్చి వాత పెట్టినట్లుగా రియాక్ట్ కాక‌పోవ‌టం కూడా కార‌ణంగా చెప్పాలి. తెలంగాణ ఉద్య‌మం జ‌రుగుతున్న వేళ‌లో.. ఉద్య‌మానికి అనుకూలంగా లేని నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించేవారు. ఊళ్లోకి కూడా రానివ్వ‌ని ప‌రిస్థితి.హైద‌రాబాద్‌ లోనూ తిర‌గ‌టానికి జంకే దుస్థితి. అలాంటి ఒత్తిడి ఏమీ ఆంధ్రాలో లేన‌ప్పుడు.. షా ఏమిటి? కొన్నాళ్లు అయితే షా మ‌న‌మ‌డు కూడా ఏపీకి ఏంతో చేశామ‌ని చెప్పేసే ప‌రిస్థితి.