Begin typing your search above and press return to search.

సిద్ధూ స‌ర్కార్ పై అమిత్ షా జోస్యం!

By:  Tupaki Desk   |   9 May 2018 8:00 AM GMT
సిద్ధూ స‌ర్కార్ పై అమిత్ షా జోస్యం!
X
మ‌రో మూడు రోజుట్లో క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌బోతోన్న నేప‌థ్యంలో క‌న్న‌డ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరింది. ప్ర‌ధాని మోదీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ....ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌పై బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మే 15తో క‌ర్ణాట‌క‌లో సిద్ధ రామ‌య్య స‌ర్కార్ కు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడ‌బోతున్నారని అమిత్ షా జోస్యం చెప్పారు. దేశ ప్ర‌జ‌ల ఆశాజ్యోతి అయిన న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని క‌న్న‌డ ప్ర‌జ‌లు బ‌ల‌ప‌ర‌చాల‌ని కోరారు. న‌వ భార‌త నిర్మాణంలో మోదీకి మద్దతుగా కన్నడిగులు ఓటేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు మంగళూరు, కావూర్‌లతో పాటు కోల్యా–తొక్కొట్టు మధ్య అమిత్ షా ర్యాలీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వం పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

క‌ర్ణాట‌కలో హంగ్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌ద‌ని, బీజేపీ స్ప‌ష్టమైన మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అమిత్ షా జోస్యం చెప్పారు. క‌ర్ణాట‌క‌లో రెండు పార్టీల మ‌ధ్య ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం లేద‌ని, సీఎం సిద్ధ రామ‌య్య‌కు క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఎన్నిక జ‌ర‌గ‌బోతోంద‌ని అన్నారు. మే 15న సీఎం సిద్ధ రామ‌య్య‌కు ఆఖరి పని దిన‌మ‌ని, ఆ రోజు క‌న్న‌డ‌ప్ర‌జ‌లు ఆయ‌న‌కు వీడ్కోలు చెబుతార‌ని జోస్యం చెప్పారు. దేశ పురోగ‌తి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తోన్న మోదీకి మ‌ద్దతివ్వాల‌ని, ఈ ఎన్నిక‌ల‌లో క‌న్న‌డ ప్ర‌జ‌లంతా బీజేపీకి ఓటెయ్యాల‌ని పిలుపునిచ్చారు. దక్షిణ కర్ణాటకలో పలువురు హిందువులను హత్యచేసిన వారిని ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, క‌ర్ణాట‌క‌లో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేష్ హత్య జ‌రిగిన త‌ర్వాత కొంద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబరాలు చేసుకున్న విష‌యాన్ని అమిత్ షా మ‌ర‌చిపోయార‌ని అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ తిప్పి కొట్టింది. మతం పేరు వాడుకొని క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో గెల‌వాల‌ని బీజేపీ భావిస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. మే 12న జ‌ర‌గ‌బోతోన్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మే 15న ప్ర‌క‌టించ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే.