వాజ్ పేయికి నివాళి..ఇదేం పని అమిత్ షా జీ?

Fri Aug 17 2018 23:12:08 GMT+0530 (IST)

భారతరత్న - మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన దత్తపుత్రిక నమిత భట్టాచార్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నమిత చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాజ్ పేయి భౌతికకాయానికి ప్రధాని మోడీ కడసారి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఆయనపై కన్నెర్ర చేసేందుకు కారణం అయింది.వాజ్పేయి అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి - ప్రధాని మోడీ - ఎల్ కే అద్వానీ - అమిత్ షా - బీజేపీ నాయకులు - అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూటాన్ రాజు - నేపాల్ - శ్రీలంక - బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు - అఫ్ఘనిస్థాన్ మాజీ ప్రెసిడెంట్ కర్జాయ్ - పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు. రాష్ట్రపతి - ప్రధాని మోడీ - ఎల్ కే అద్వానీ పక్కన ఆసీనుడైన అమిత్ షా ఈ సందర్భంగా అభ్యంతరకరంగా వ్యవహరించారని చర్చ జరుగుతోంది. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన కాలు మీద కాలు వేసుకొని ఠీవీగా కూర్చొని ఉండటంపై పలువురు నెటిజన్లు భగ్గుమంటున్నారు. జాతి గర్వించదగ్గ నాయకుడికి అంత్యక్రియలు జరుగుతుంటే....పార్టీ నేత - ఆయన కంటే జూనియర్ - పైగా కీలక స్థానంలో ఉన్న వ్యక్తి వ్యవహరించాల్సిన విధానం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే అమిత్ షా అహంకారం స్పష్టమవుతోందని మండిపడుతున్నారు.

కాగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అస్థికలను ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాజ్‍ పేయి చితాభస్మాన్ని గంగ - యమున - తపతి తదితర నదులన్నింటిలోనూ నిమజ్జనం చేస్తామని సర్కార్ ప్రకటించింది. వాజ్పేయి కర్మభూమి ఉత్తర్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించిన యూపీ సీఎం యోగి.. యూపీతో అటల్ ది ప్రత్యేక అనుబంధం అని అన్నారు. వాజ్ పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించినప్పటకీ యూపీతో  విశేషానుబంధం ఉంది. కాన్పూర్ యూనివర్శిటీలోనే రాజకీయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. లఖ్ నవ్ నుంచి వాజ్ పేయి వరుసగా ఎంపీగా గెలిచారు.