బాబుపై 'స్వకుల' దాడి

Fri Nov 02 2018 10:39:26 GMT+0530 (IST)

కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి - తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో కూటమి కడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కమలనాథులు కొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం నాయకులు - ఆ పార్టీ సానుభూతి పరులపై ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించడం - ప్రజల్లో చంద్రబాబు అండ్ కో ను చులకన చేయడం వరకే పరిమితం అయిన కమలనాథులు ఇప్పుడు సరికొత్త దాడికి రంగం చేసినట్లే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించేందుకు స్వకులంతో జట్టు కట్టి విజయం సాధించారు ఆనాడు మహా నటుడు ఎన్.టి.రామారావు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడ్ని దెబ్బ తీసేందుకు అదే ఫార్ములాను వాడాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడి కులాన్నే ఆయన పతనానికి వాడుకోవాలన్నది కమలనాథుల యోచనగా చెబుతున్నారు. ఈ ప్రయోగం కోసం కుల సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకురావాలన్నది భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల భావనగా తెలుస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ కు - ఇటు తెలుగు రాష్ట్రాల్లో చాలా  బలంగా ఉన్న రెడ్లకు వ్యతిరేకంగా అవతరించింది. ఇందుకే రెడ్లకు వ్యతిరేకమైన కమ్మ వారంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్ధితులు మారిపోయి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోనూ - రెడ్లతో జత కట్టేందుకు ముందుకు రావడంతో ఆయన స్వకులాన్నే ఆయుధంగా మలచాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ - పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని కమ్మ కులస్తులు జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీలోని ఆ కులస్తుల నుంచి తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం అక్కడి నుంచే నరుక్కు రావాలని భావిస్తోందంటున్నారు. ఇందుకోసం అగ్ర నేతలను రంగంలోకి దింపాలన్నది వారి యోచన. పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కె.అద్వానీకి ఈనాాడు పత్రికల యజమాని రామెజీరావుతో అత్యంత సాన్నిహిత్యం ఉందంటున్నారు. అద్వానీ ద్వారా రామోజీరావును ప్రభావితం చేయాలని - దాని ద్వారా మీడియాకు చంద్రబాబును దూరం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ముప్పరపు వెంకయ్య నాయుడి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ వారందరూ ఏకం కావాలని - తెలుగుదేశం పార్టీని కమ్మవారంతా కాపాడుకోకపోతే భవిష్యత్ అంథకారమేననే సంకేతాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పార్టీలో ఉన్న కంభంపాటి హరిబాబు - కామినేని శ్రీనివాస్ వంటి వారితో కూడా చర్చించి తెలుగుదేశం పార్టీలో కమ్మ వారంతా ఏకం కావాలనే ప్రచారాన్ని తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడ్ని కట్టడి చేసేందుకు స్వకులమే సరైన మార్గంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.