Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల మ‌న‌సుల్ని హ‌ర్ట్ చేసిన అమిత్ షా

By:  Tupaki Desk   |   26 May 2017 7:19 AM GMT
ఆంధ్రోళ్ల మ‌న‌సుల్ని హ‌ర్ట్ చేసిన అమిత్ షా
X
ఏపీ ప్ర‌జ‌ల తీరు కాస్త భిన్నం. ఆ మాట‌కు వ‌స్తే వారు ఓ ప‌ట్టాన అర్థం కార‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్రాన్ని రెండు ముక్క‌లుగా చేసిన‌ప్పుడు వారిలో వ్య‌తిరేక‌త అంత ఎక్కువ లేద‌న్న మాట‌ను ప‌లువురు వ్య‌క్తం చేశారు. నాటి పాల‌క‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ నేత‌లు అయితే.. విభ‌జ‌న మీద ఆంధ్రోళ్ల‌లో వ‌చ్చిన ఆగ్ర‌హం మ‌హా అయితే రెండు మూడేళ్ల‌లో స‌ర్దుకుంటుంద‌న్న అభిప్రాయాన్ని వినిపించేవారు. కానీ.. జ‌రిగిందేమిట‌న్న‌ది చూస్తే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వారికి ఒక్క‌టంటే ఎమ్మెల్యే సీటులో గెల‌వ‌లేక‌పోవ‌ట‌మే కాదు.. రానున్నా పాతికేళ్ల‌లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ‌తికే ఛాన్స్ లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. అంతేనా.. ఎన్నిక‌లు జ‌రిగి మూడేళ్లు అవుతున్నా.. నేటికి విభ‌జ‌నకు కార‌ణం కాంగ్రెస్ పార్టీగా న‌మ్మ‌ట‌మే కాదు.. ఆ పార్టీని ఎప్ప‌టికి క్ష‌మించేది లేద‌న్న మాట‌ను ఆంధ్రోళ్ల నోట వినిపిస్తూ ఉంటుంది.

నాడు జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న‌కు కాంగ్రెస్ కీల‌క‌మైనా.. బీజేపీ కూడా అంతోఇంతో సాయం చేసింద‌న్న విష‌యం ఆంధ్రోళ్ల‌కు తెలియంది కాదు. కానీ.. పాల‌క‌ప‌క్షంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యాన్ని తాను వ్య‌తిరేకించినా ఫ‌లితం ఏమీ ఉండ‌ద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకోవ‌టంతో పాటు.. త‌మ‌కున్న లెక్క‌ల‌తో నాటి విభ‌జ‌న‌ను బీజేపీ ఓకే చేసేసింది.

అయితే.. విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని క‌వ‌ర్ చేయ‌టంలో బీజేపీ త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని న‌మ్మారు ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు. వారి ఆశ‌ల‌కు త‌గ్గ‌ట్లే 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ సాంత్వ‌న మాట‌లు చెప్పారు. ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా ఏపీ రాజ‌ధాని నిర్మాణం చేప‌డ‌తామ‌ని చెప్పారు. తాము అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్ప‌ట‌మే కాదు.. చాలానే హామీలు ఇచ్చారు. వీటిని న‌మ్మేసిన ఏపీ ప్ర‌జ‌లు టీడీపీ.. బీజేపీ జ‌ట్టుకు ఓటేశారు. దీనికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు కూడా తోడ‌య్యాయి.

మోడీని న‌మ్మాల్సిందిగా ఓప‌క్క చంద్ర‌బాబు.. మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్ప‌టంతో ఏపీ ప్ర‌జ‌లు అనుమానంతోనే ఓటేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం అనంత‌రం.. చోటు చేసుకున్న ప‌రిణామాలు చూసిన‌ప్పుడు ఆంధ్రోళ్ల అనుమానం నిజ‌మైంది. వ్యూహం ప్ర‌కారం ఏపీకి ఇవ్వాల్సిన హోదాకు మంగ‌ళం పాడేసిన బీజేపీ.. టీడీపీలు.. హోదా బ‌దులుగా ప్యాకేజీ పేరుతో ఏపీ ప్ర‌జ‌ల్ని మోస‌పుచ్చుతున్నారు.

ఈ బాధ ఆంధ్రోళ్ల గుండెల్లో ఉన్నా.. ఇప్పుడు స‌మ‌యం కాద‌న్న‌ట్లుగా వెయిట్ చేస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం.. ప్ర‌త్యేకించి ఏపీకి ఇస్తామ‌ని చెప్పిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో నిజాయితీగా.. మొద‌ట్నించి ఒకే స్టాండ్ ను వినిపించిన పార్టీ ఏదైనా ఉందంటే జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం హోదా విష‌యంలో మొద‌ట్లో కాసింత దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. త‌ర్వాత కాలంలో ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌టం క‌నిపిస్తుంది. అయితే.. జ‌గ‌న్ మాత్రం తాను చెప్పిన మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌ట‌మే కాదు.. ఏపీకి హోదా విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న మాట‌ను త‌ర‌చూ చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. హోదా మీద విప‌రీత వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. హోదాను తుంగ‌లోకి తొక్కేసిన‌ట్లుగా చెప్పిన మాట‌లు ఆంధ్రోళ్ల‌ను హ‌ర్ట్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. కేంద్రంలో బ‌ల‌మైన ప్ర‌భుత్వంగా ఉన్న నేప‌థ్యం.. ఇప్ప‌టికిప్పుడు ఆగ్ర‌హంతో వ‌చ్చేదేమీ లేని నేప‌థ్యంంలో వ్యూహాత్మ‌క మౌనాన్ని ఏపీ ప్ర‌జ‌లు పాటిస్తున్న‌ట్లుగా ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. మిగిలిన వారికి భిన్నంగా.. త‌మ గుండెల్లోని మంట‌ను అట్టే దాచి పెట్టుకొని టైం చూసుకొని అస‌లు వ‌డ్డీతో స‌హా తీర్చుకోవ‌టం అల‌వాటేన‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడేసినా ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌ని వైనం క‌నిపిస్తుంది. అమిత్ షా మాట‌ల‌కు ఏపీ బీజేపీ నేత‌లు కానీ ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు కానీ రియాక్ట్ కాక‌పోవ‌టం.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా మాట్లాడుతున్నా.. అన‌వ‌స‌ర‌మైన స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న పార్టీల్ని.. నాయ‌కుల్ని ఏపీ ప్ర‌జ‌లు అంత తేలిగ్గా క్ష‌మించ‌ర‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. వాద‌న‌కు కౌంట‌ర్ వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది.

అధికార టీడీపీ.. బీజేపీలు హోదా మీద వెన‌క్కి త‌గ్గిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హోదాను ప్యాకేజీతో క‌వ‌ర్ చేశామ‌న్న మాట‌ను ఏపీ ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్న వేళ‌.. హోదా మీద అమిత్ షా మాట‌లు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌వ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ త‌ర‌హా వాద‌న‌ను ప‌లువురు కొట్టిపారేస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేసిన ప్ర‌తిఒక్క‌రూ అందుకు త‌గ్గ మూల్యం చెల్లించార‌ని.. తాజా ఎపిసోడ్‌కు సంబంధించి కూడా ఏపీ అధికార‌ప‌క్షానికి.. బీజేపీకి ఆంధ్రోళ్లు స‌రైన స‌మ‌యంలో స‌రైన స‌మాధానాన్ని చెబుతారంటున్నారు. మ‌రీ.. విష‌యంలో ఎవ‌రి మాట నిజ‌మ‌న్న‌ది కాలం మాత్ర‌మే స‌రిగ్గా తేలుస్తుంద‌ని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/