Begin typing your search above and press return to search.

టీడీపీతో క‌టీఫ్ పై క్లారిటీ ఇచ్చేసిన షా

By:  Tupaki Desk   |   27 May 2017 4:44 AM GMT
టీడీపీతో క‌టీఫ్ పై క్లారిటీ ఇచ్చేసిన షా
X
ఇప్పుడు చెప్పేది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఓ ప‌ట్టాన మింగుడుప‌డ‌నిదిగా చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీతో స్నేహం కోసం బాబు ప‌డుతున్న తాప‌త్రయం అంతాఇంతా కాదు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా క‌టీఫ్ చెప్ప‌టానికి సిద్ధంగా బీజేపీతో క‌లిసి సాగేందుకు ఆయ‌న చాలానే క‌ష్ట‌ప‌డుతున్నారు. కేసుల భ‌యమ‌ని కొంద‌రు అంటున్నా.. ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే బాబు అంత‌లా బీజేపీ స్నేహం కోసం పాకులాడుతున్న‌ట్లుగా ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారే. కేంద్రంలో స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని కొన‌సాగించే స‌త్తా మోడీకి ఉండ‌టంతో పాటు.. రానున్న రోజుల్లోనూ ఆయ‌న బ‌లీయ‌మైన శ‌క్తిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు బీజేపీతో త‌గువు పెట్టుకోవ‌టానికి బాబు ఏ మాత్రం సిద్ధంగా లేరంటున్నారు.

ఇదే స‌మ‌యంలో బాబు పార్టీతో క‌టీఫ్ చెప్పేసి.. సొంతంగా పార్టీని పెంచి పెద్ద‌ది చేసుకుంంటే ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రిస్తామ‌న్న‌ది ఏపీ క‌మ‌ల‌నాథుల వాద‌న‌. ఇదే విష‌యాన్ని తాజాగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో చెప్పేశారు. త‌న‌తో త‌మ వాళ్లు క‌టీఫ్ విష‌యాన్ని తీసుకొచ్చార‌న్న ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట‌ను మీడియా ముందు అమిత్ షా ఒప్పేసుకోవ‌టం విశేషం.

మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా.. ఏపీలో నిర్వ‌హించిన బీజేపీ బూత్ క‌మిటీ స‌మావేశంలో ఏపీ అధికార‌ప‌క్షంతో తెగ‌తెంపులు చేసుకుందామంటూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించార‌ట క‌దా? అని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించ‌గా.. నిజ‌మేన‌న్న అమిత్ షా.. ఏపీ అధికార‌ప‌క్షంతో తెగ‌తెంపులు చేసుకుందామ‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. నేత‌ల నుంచి త‌న‌కు స‌ల‌హాలు వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి.. దీనికి బీజేపీ నిర్ణ‌యం ఏమిట‌న్న విష‌యాన్ని మీడియాకు ఎందుకు చెప్పాలంటూ అమిత్ షా త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించి.. విష‌యాన్ని ఒక‌చోట ఆపేయ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా.. తన తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తాను చెప్పిన మాట‌లు నిజ‌మేన‌ని.. తాను చెప్పిన ఏ విష‌యాలు అమ‌లు కాలేదో చెప్పాల‌ని షా స‌వాలు విసిరారు. కేంద్ర ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల ద్వారా ప్ర‌క‌టించిన సాయంలో తాను చెప్పిన ఏ విష‌యాలు అమ‌లు కాలేదో చెప్పాల‌న్న ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్ని త‌ప్పు ప‌ట్టారు. కేసీఆర్ విమ‌ర్శ‌ల్ని త‌ప్పుప‌ట్టిన అమిత్ షా.. తాను నిజాల్నే చెప్పాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ విసిరిన స‌వాలును అమిత్ షా ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

తెలుగు రాష్ట్రాల ముచ్చ‌ట‌ను ప‌క్క‌న పెడితే.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ 2014లో సాధించిన 282 మార్కును సులువుగా దాటుతుంద‌న్న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు అమిత్ షా. గ‌తంలో విప‌క్షంలో ఉన్న యూపీ.. ఉత్త‌రాఖండ్ ల‌లో త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటైంద‌ని.. వీటితో పాటు.. తెలంగాణ‌.. ప‌శ్చిమ‌బెంగాల్‌.. ఒడిశా.. కేర‌ళ‌లో త‌మ‌కు అధిక స్థానాలు ద‌క్కించుకుంటామ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంద‌ని..కాంగ్రెస్‌.. స్థానిక పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ గ‌త స్కోర్‌ ను క‌చ్ఛితంగా అధిగ‌మిస్తామ‌న్నారు. మూడేళ్ల మోడీ పాల‌న‌తో దేశం ఆర్థికంగా ఎదగ‌ట‌మే కాదు.. భార‌త ఆత్మ‌గౌర‌వాన్ని పెంచేలా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేసింద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. 2024 నాటికి దేశంలో విద్యుత్ లేని గ్రామం.. మ‌రుగుదొడ్డి లేని ఇళ్లు.. గ్యాస్ క‌నెక్ష‌న్ లేని నివాసం అంటూ ఉంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/