Begin typing your search above and press return to search.

ఒకే ప్ర‌శ్న‌తో కేసీఆర్ పాల‌న‌ను తేల్చేసిన 'షా'

By:  Tupaki Desk   |   23 May 2017 7:35 AM GMT
ఒకే ప్ర‌శ్న‌తో కేసీఆర్ పాల‌న‌ను తేల్చేసిన షా
X
రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాల‌న్న త‌మ స్వ‌ప్నాన్ని సాకారం చేసుకునేందుకు న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌తో షురూ చేశారు బీజేపీ చీఫ్ అమిత్ షా. మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తూ.. వివిధ గ్రామాల్లో ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతూ.. వారి స‌మ‌స్య‌ల్ని ఇబ్బందుల్ని తెలుసుకుంటున్నారు. ప‌నిలో ప‌నిగా కేంద్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి.. వాటి ప్ర‌యోజ‌నాలు పొందుతున్నారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

కుటుంబ పాల‌న‌తో బంగారు తెలంగాణ సాధ్యం కాదంటూ త‌గ‌లాల్సిన చుర‌క‌ల్ని త‌గిలిస్తూ.. స‌న్న స‌న్న‌గా విమ‌ర్శ‌లు చేస్తూ త‌న ప‌ర్యట‌న కొన‌సాగిస్తున్నారు. అమిత్ షా తొలి రోజు ప‌ర్య‌ట‌న‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ప్పుడు మూడు ముఖ్య‌మైన విష‌యాల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

అందులో ఒక‌టి కేంద్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న తీరును ఆయ‌న ప్ర‌శ్నించ‌టం.. అందుకు సానుకూలంగా స‌మాధానం రాక‌పోవ‌టాన్ని ఎత్తి చూప‌టం ద్వారా టీఆర్ ఎస్ స‌ర్కారు పాల‌నా వైఫల్యాన్ని తెలివిగా ఎత్తి చూపించారు. మ‌రో కీల‌క అంశం.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు త‌మ పార్టీ దూర‌మ‌ని చెబుతూ అందుకు ఉదాహ‌ర‌ణ‌లు చూపించటం. కాంగ్రెస్‌ లో సోనియా త‌ర్వాత రాహుల్ అన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూనే.. తెలంగాణ‌లో కేసీఆర్ త‌ర్వాత అయితే కేటీఆర్ లేదంటే క‌విత‌లే పార్టీని చూస్తార‌ని.. కుటుంబ పాల‌న‌లో బంగారు తెలంగాణ సాధ్యం కాద‌ని తేల్చేశారు.

త‌న వ‌ర‌కు త‌న ఉదాహ‌ర‌ణ‌ను చెబుతూ పార్టీలో బూత్ స్థాయి అధ్య‌క్షుడిగా త‌న ప్ర‌యాణం మొద‌లై నేడు పార్టీ అధ్య‌క్షుడిని అయ్యాన‌ని.. రైల్వేస్టేష‌న్లో ఛాయ్ లు అమ్ముకునే మోడీ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్నారంటూ చెబుతూ మిగిలిన పార్టీల‌కు బీజేపీ ఎంత భిన్న‌మైన‌ద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

మూడో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్ర‌భుత్వం పాల‌న‌లో ఉంటే నిధుల దుర్వినియోగానికి అవ‌కాశం ఉండ‌ద‌న్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. అందుకు ఉదాహ‌ర‌ణ‌లు ఎత్తి చూపించ‌టం ద్వారా.. కేసీఆర్ స‌ర్కారు ప‌స ఎంత‌న్న‌ది త‌న‌దైన శైలిలో చెప్పేశార‌ని చెప్పాలి. చురుక్కుమ‌నిపించే విమ‌ర్శ‌లు చేయ‌కుండా సాదాసీదాగా మాట్లాడుతున్న‌ట్లుగా మాట్లాడి తాను చెప్పాల‌నుకున్న‌ది అమిత్ షా చెప్పేయ‌టం టీఆర్ఎస్ నేత‌ల‌కు స‌రికొత్త అనుభ‌వంగా చెబుతున్నారు.