Begin typing your search above and press return to search.

మోడీ పకోడీ : ఇది ఇప్పట్లో వదిలే పీడ కాదు!

By:  Tupaki Desk   |   14 Feb 2018 12:30 PM GMT
మోడీ పకోడీ : ఇది ఇప్పట్లో వదిలే పీడ కాదు!
X
ఇంతకూ మోడీ చాయ్ గొప్పదా? మోడీ పకోడీ గొప్పదా? కావలిస్తే ఈ విషయం మోడీనే అడిగిచూడండి.. ‘మోడీ చాయ్’ అనే పదం వినిపిస్తే ఆయన అదొకరకమైన తన్మయావస్థలోకి వెళ్లిపోతారు.. అదే చాయ్.. తన బాల్యాన్ని తియ్యగా గడిపే అవకాశం ఇచ్చింది! అదే చాయ్ తనకు ప్రధాని కుర్చీ అందించింది. చివరికి అదే చాయ్.. మొన్నటికి మొన్న గుజరాత్ పీఠాన్ని కూడా తన చేతిలో పెట్టింది. అందుకే చాయ్ ఆయనకు ఆనందం కలిగిస్తుంది. కానీ.. ‘మోడీ పకోడీ’ అనే పదం వినిపిస్తే ఆయన ఉలికిపాటుకు గురవుతారు.. ఆ పదాన్ని కనిపెట్టింది ఆయనే.. ప్రచారంలోకి తెచ్చింది ఆయనే. తన మాట నిజమే అని.. పకోడా మాటలను సమర్థించినది ఆయన దళపతులే. కానీ.. పకోడీ మాత్రం.. ‘నిను వీడని నీడను నేనే’ అంటూ.. మోడీకి నిద్రలేని రాత్రులను ప్రసాదించేలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

ఉద్యోగాల కోసం గోల చేయడంలో అర్థం లేదు. ఎవడైనా రోడ్డు మీద పకోడీ అమ్ముకుంటూ రోజుకు 200 రూపాయలు సంపాదించినా.. అది ఉద్యోగం కిందే లెక్క.. అని మోడీ టీవీ ఇంటర్వ్యూలో ఏ ముహూర్తాన చెప్పారో గానీ.. ఆయనను ఇంతగా ఈ మధ్యకాలంలో మరొక్కఅంశం ఇరకాటంలో పెట్టలేదేమో అని అనిపిస్తోంది. మోడీ ఎక్కడకు వెళ్లినా.. పకోడీ భూతం ఆయనను నీడలా వెన్నాడుతోంది. ఆమధ్య ఎన్నికల ప్రచారానికి బెంగుళూరు వస్తే.. పట్టభద్రులంతా.. స్నాతకోత్సవ దుస్తులతో వేదిక బయట రోడ్ల మీద పకోడా అమ్ముతూ.. పరువు తీశారు. అప్పటినుంచి యావత్ దేశంలో మోడీ వ్యతిరేక గళం వినిపించదలచుకున్న కుర్రకారుకు సులువైన మార్గం దొరికిపోయింది. ఓ వంద రూపాయలు పెట్టి.. పకోడా పొట్లం కొంటే చాలు.. దాన్ని మారు బేరాలకు అమ్ముకుంటూ.. వీలైనంతగా మోడీ పరువు తీసేయవచ్చు. అందరూ ప్రతిచోటా ఇదే పనిచేస్తున్నారు. అమిత్ షా తదితర మోడీ దళం మాత్రం.. పకోడీ బేరాలను సమర్థించుకుని.. నిజమే కదా.. ఖాళీగా ఉండడం కంటె పకోడీ అమ్మితే తప్పేంటి అని అన్నారు గానీ.. వారి వాదన జనానికి ఎక్కలేదనేది పలువురి అభిప్రాయం.

కాకపోతే.. ఇప్పుడు అమేథికి చెందిన కుర్రాడు అశ్విన్ మిశ్రా పకోడీ జాయింట్ వ్యాపారానికి ముద్ర పథకం కింద రుణసహాయం చేయాలంటూ మోడీ సర్కారుకు లేఖ రాశాడు. బ్యాంకులు తనకు లోన్ ఇవ్వడం లేదని.. ప్రధాని టీవీ ఇంటర్వ్యూ స్ఫూర్తితో ఉద్యోగ ప్రయత్నాలు మానేసి పకోడీ అమ్మాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఈ అశ్విన్ మిశ్రా అమేథినుంచి లేఖ రాశాడు గనుక.. దీన్ని రాహుల్ కు అంటగట్టడానికి వీల్లేదు. ఎందుకంటే... అతను భాజపా అమేథి సోషల్ మీడియా విభాగానికి మాజీ చీఫ్ కూడా. తమ పార్టీ వాడే... పకోడీ వ్యాపారం అంటూ బజారు కెక్కాడంటే.. ఇక ఇతరత్రా ప్రభుత్వం పరువు పకోడీ ముసుగులో ఎంత లాసవుతున్నదో మోడీజీ ఆలోచించుకోవాలి.