Begin typing your search above and press return to search.

అమెరికా మాజీ అధ్య‌క్షులు ఏం చేస్తున్నారంటే...

By:  Tupaki Desk   |   12 Jan 2017 5:30 PM GMT
అమెరికా మాజీ అధ్య‌క్షులు ఏం చేస్తున్నారంటే...
X
మరోవారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న బరాక్ ఒబామాకు స్ఫూటిఫై అనే స్వీడిష్ కంపెనీ ఉద్యోగం ఇస్తానని ముందుకు రావ‌డం వార్త‌ల్లో విశేషంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఆ తర్వాత ఎలాంటి జీవితం గడుపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జీవించి ఉన్న నలుగురు మాజీ అధ్యక్షులు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం..

జార్జి వాషింగ్టన్ బుష్ (జూనియర్ బుష్) -అధ్యక్ష కాలం: 2001-2009

అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీవిరమణ తర్వాత టెక్సాస్‌లో స్థిరపడ్డారు. అప్పటి నుంచి రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. పలు సంస్థల్లో పెయిడ్ స్పీచ్‌లు ఇస్తున్నారు. తన పేరుతో డల్లాస్‌లో నెలకొల్పిన జార్జ్ డబ్ల్యూబుష్ ప్రెసిడెన్షియల్ సెంటర్ కార్యకలాపాల్లో భాగస్వామి అవుతున్నారు. ఇందులో ఓ విద్యాసంస్థ, మ్యూజియం ఉన్నాయి. బుష్ సంస్థ ఆర్థిక రంగంలో వేగవంతమైన వృద్ధి సాధించడంపై పరిశోధనలు చేస్తున్నది. స్వేచ్ఛ - విద్య - ఆరోగ్యం - మహిళా హక్కులపై అధ్యయనం చేస్తున్నది.

బిల్ క్లింటన్ - అధ్యక్ష కాలం: 1993-2001

అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత సైతం బిల్ క్లింటన్ ప్రజల మధ్యే కనిపిస్తున్నారు. ఆయన పేరుతో ఆర్కనాస్‌లో నెలకొల్పిన విలియం జే. క్లింటన్ ప్రెసిడెన్షియల్ సెంటర్ అండ్ పార్క్‌ను 2004లో ప్రారంభించారు. పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కువగా పెయిడ్ స్పీచ్‌లు ఇస్తూ నిధులు జమ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షులు తీసుకునే నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన 2004లో రచించిన మై లైఫ్, 2007లో రాసిన గివింగ్ పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్ జాబితాలో చోటు సంపాదించాయి. 2004లో సునామీ ముంచెత్తినప్పుడు ఐక్యరాజ్యసమితి సహాయక బృందానికి నేతృత్వం వహించారు. 2005లో మాజీ అధ్యక్షుడు బుష్‌తో కలిసి నిధులు సమీకరించి బాధిత ప్రాంతాలకు అందించారు. ఆయన స్థాపించిన విలియం జే. క్లింటన్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నది. ఎయిడ్స్‌పై వివిధ దేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

జార్జ్ హెర్బార్ట్ వాకర్ బుష్ (సీనియర్ బుష్) - అధ్యక్షకాలం: 1989-1993

ప్రస్తుతం జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుల్లో పెద్దవాడు. 41వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ అనుభవం ఉండి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనవారిలో ఆయనే చివరివాడు కావడం గమనార్హం. 1993లో వైట్‌హౌస్‌ను వీడి భార్య బార్బారాతో కలిసి టాంగిల్‌వుడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 199399 వరకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫర్ ఎసిన్‌హోవర్ ఫెలోషిప్స్‌కు చైర్మన్‌గా, 200709 వరకు నేషనల్ కానిస్టిట్యూషన్ సెంటర్‌కు చైర్మన్‌గా ఉన్నారు.

జిమ్మీ కార్టర్ -అధ్యక్షకాలం: 1977-81

అధ్యక్షకాలం ముగిసిన తర్వాత జిమ్మీ కార్టర్ జార్జియా వెళ్లిపోయారు. 1982లో అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో కార్టర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ దేశాల్లో మానవహక్కుల కోసం, పారదర్శక, అవినీతి రహిత ఎన్నికల కోసం పోరాడుతున్నది. 1989 నుంచి ఇప్పటివరకు 38 దేశాల్లో 96 ఎన్నికలను పర్యవేక్షించింది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య ప్రమాణాలు పెంచడంతోపాటు వివిధ వ్యాధుల నిర్మూలనకు పోరాడుతున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/