Begin typing your search above and press return to search.

రన్నింగ్ ఫ్లైట్ : కాక్ పిట్ లో ఫైలట్ డెడ్ బాడీ

By:  Tupaki Desk   |   6 Oct 2015 7:17 AM GMT
రన్నింగ్ ఫ్లైట్ : కాక్ పిట్ లో ఫైలట్ డెడ్ బాడీ
X
ఆ విమానంలో ప్ర‌యాణికుల ప్రాణాలు కాసేపు గాల్లో తేలాయి.... బ‌తుకుతామో, గాల్లోనే క‌లిసిపోతామో తెలియ‌ని స్థితిలో కూడా వారంతా ఎప్ప‌టిలా మామూలుగానే ఉన్నారు.... ప్రాణ‌భ‌యంతో కేక‌లు వేయ‌లేదు.... కంగారుప‌డి ప‌రుగులు తీయ‌లేదు...ప్యారాచూట్లు తెరిచి కింద‌కు దూకేయ‌లేదు... ఆశ‌ర్యంగా ఉందా... ప్రాణం పోయే ప్ర‌మాద‌మని తెలిసినా అంత కూల్ గా ఎలా ఉన్నారా అని సందేహ‌మా... కార‌ణం ఒక్క‌టే.... వారెవ‌రికీ అస‌లు విష‌యం తెలియిక‌పోవ‌డ‌మే. విమానం న‌డుపుతున్న పైల‌ట్ అక‌స్మాత్తుగా చ‌నిపోయాడ‌ని తెలిస్తే ఎవ‌రికైనా గుండాగిపోతుంది... కానీ, ఆ విష‌యం తెలియ‌క‌పోవ‌డంతో ప్రాణాపాయ స్థితిలోనూ ప్రయాణికులంతా కూల్ గా ఉన్నారు. అమెరికాలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌లో విమానం సుర‌క్షితంగా నేల‌కు దిగిన త‌రువాత అస‌లు సంగ‌తి తెలుసుకున్న ప్ర‌యాణికులు అప్పుడు గ‌గ్గోలు పెట్టారు. ఇంత‌కీ పైల‌ట్ చ‌చ్చిపోతే విమానం సుర‌క్షితంగా దిగిందా అనుకుంటున్నారా.... కో పైల‌ట్ ఉన్నాడు క‌దా... ఆయ‌న ధైర్య‌మే అంద‌రినీ కాపాడింది.

ఆదివారం అర్ధ‌రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 550 ఫోనిక్స్ నుంచి బోస్టన్ కు బయలు దేరింది. విమానం వేల అడుగుల ఎత్తున ఉన్న‌ప్పుడు పైల‌ట్ కు స‌డెన్ గా తీవ్ర అస్వస్థత.. నిమిషాల్లోనే చ‌నిపోయాడు. కో పైల‌ట్ కు చెమ‌ట‌లు ప‌ట్టేశాయి... అయితే... విమానంలో ఉన్న‌వారికి ఈ విష‌యం తెలిస్తే ప్ర‌మాద‌మ‌ని...వారికి హార్ట్ అటాక్ వ‌చ్చేస్తుంద‌ని తెలిసిన ఆయ‌న స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించాడు. వెంటనే విమానం బాధ్యతలు తీసుకున్నాడు. స‌మీపంలో ఉన్న సిరాకస్ కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు. రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్ ను పంపించాలని కోరాడు. సిరాకస్ అధికారులు ఓకే అన్నారు.... స‌హ‌చ‌రుడి మృత‌దేహాన్ని ప‌క్క‌నే పెట్టుకుని గుండె నిబ్బ‌రంతో.... క‌న్నీళ్ల‌తో విమానాన్ని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు.

విమానాన్ని దించేసిన త‌రువాతే అక్క‌డి అధికారుల‌కు కూడా పైల‌ట్ చ‌నిపోయాడ‌న్న సంగ‌తి తెలిసింది. ప్ర‌యాణికులకూ ఆ విష‌యం తెలిసింది. కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకోగా.. అందులోని ప్రయాణికులైతే ఆయ‌న్ను ఆకాశానికెత్తేశారు.

ఆ విమానంలోని మొత్తం 147 మంది ప్ర‌యాణికుల‌ను మ‌ళ్లీ వేరే విమానంలో గ‌మ్య‌స్థానాల‌కు పంపించారు. అయితే.... ఇలాంటి సంఘ‌ట‌న‌లు అమెరికాలో గతంలోనూ జ‌రిగాయి. అమెరికాలో ఇలా విమానం న‌డుపుతూ ఏడుగురు పైల‌ట్లు మ‌ర‌ణించార‌ట‌. కో పైల‌ట్ లు ధైర్యంగా ఉండ‌బ‌ట్టి ప్ర‌యాణికుల ప్రాణాల‌కు ప్ర‌మాదం త‌ప్పుతోంది.