Begin typing your search above and press return to search.

బంగార‌మంతా ఎక్క‌డుంద‌య్యా అంటే...

By:  Tupaki Desk   |   26 Jun 2017 10:00 AM GMT
బంగార‌మంతా ఎక్క‌డుంద‌య్యా అంటే...
X
బంగారం...దేశం ఏదైనా స్వ‌ర్ణంపై ఉన్న మోజు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కొంద‌రు డ‌బ్బు త‌ర్వాత ఇంకా చెప్పాలంటే డ‌బ్బు కంటే ఎక్కువ‌గా ప‌లు సంద‌ర్భాల్లో బంగారానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలా ఆయా దేశాల పౌరులు - విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో భాగంగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ప‌లు దేశాల్లో భారీగా బంగారం నిల్వ‌లు పోగుప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో బంగారం నిల్వ‌ల గురించి వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ నివేదిక ఇచ్చింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం అగ్ర‌రాజ్యం అమెరికా స్వ‌ర్ణం నిల్వ‌ల్లో కూడా టాప్‌ లో నిలిచింది.

వ‌ర‌ల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్ర‌కారం అమెరికా - జ‌ర్మ‌నీ - ఇట‌లీ - ఫ్రాన్స్‌ - చైనా మొద‌టి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 8133.5 ట‌న్నులు నిల్వ‌ల‌తో అమెరికా మొద‌టి స్థానంలో ఉంది. అమెరికా విదేశీ మారక నిల్వ‌ల్లో 74.9% బంగార‌మే. 2015 న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం 48,900 బిలియన్ డాలర్ల సంపదతో అమెరికా అగ్ర‌స్థానంలో ఉంది. దాదాపు నాలుగింట మూడొంతుల బంగారం నిల్వ‌లు అమెరికాలో ఉన్నాయి. 3381 ట‌న్నులు బంగారం నిల్వ‌లు క‌లిగి ఉన్న జ‌ర్మ‌నీ రెండో స్థానంలో ఉంది. ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం 68.9%. దీన్ని మ‌రింత‌గా పెంచుకునేందుకు ఈ దేశం కృషిచేస్తోంది. మూడో స్థానంలో ఉన్న ఇట‌లీలో 2451.8 ట‌న్నుల బంగారం నిల్వ‌లు ఉన్నాయి. ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం 68% కావ‌డం విశేషం. 2435.7 ట‌న్నుల స్వ‌ర్ణంతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 62.9. ఐదో స్థానంలో ఉన్న మ‌న పొరుగు దేశం చైనాలో స్వ‌ర్ణం నిల్వ‌లు 1797.5 ట‌న్నులు కాగా ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం కేవ‌లం 2.2% మాత్ర‌మే. అయితే ప్ర‌పంచంలో బంగారాన్ని అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేసే దేశం చైనాయే కావ‌డం గ‌మ‌నార్హం.

1460.4 ట‌న్నుల బంగారం నిల్వ‌ల‌తో ర‌ష్యా ఆరో స్థానంలో ఉంది. ఆ దేశ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో 15% స్వ‌ర్ణం ఆక్ర‌మించింది. అయితే పెద్ద ఎత్తున బంగారం కొనే ప్ర‌ణాళిక‌ల‌ను ర‌ష్యా ర‌చిస్తోంది. 1040 ట‌న్నులతో స్విట్జ‌ర్లాండ్ ఏడో స్థానంలో ఉంది. విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 6.7%. జ‌పాన్‌ లో 765.2 ట‌న్నుల స్వ‌ర్ణం నిల్వ‌లు ఉన్నాయి. జ‌పాన్ విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం కేవ‌లం 2.4% మాత్ర‌మే.
61.2%తో విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతాన్ని భారీగా క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ 612.5 ట‌న్నులు బంగారు నిల్వ‌లు ఉండ‌టం వ‌ల్ల నెద‌ర్లాండ్స్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇక మ‌న‌దేశం విష‌యానికి వ‌స్తే 557.7 ట‌న్నుల స్వ‌ర్ణం మ‌న దేశంలో ఉంది. మొత్తం విదేశీ మార‌క‌పు నిల్వ‌ల్లో బంగారం శాతం: 6.3% కాగా, బంగారాన్ని అత్య‌ధికంగా వినియోగించే వారిలో భార‌తీయుల‌ది రెండో స్థానం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/