Begin typing your search above and press return to search.

భారత ప్రతిదాడిపై అమెరికా ఫీలింగ్ ఏంటంటే...

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:34 AM GMT
భారత ప్రతిదాడిపై అమెరికా ఫీలింగ్ ఏంటంటే...
X
సహనంగా ఉంటూ.. ఎప్పటికైనా దాయాది బుద్ధి మారుతుందని ఓపిగ్గా చూసినప్పటికీ తన వంకర బుద్దిని పోనిచ్చుకోని పాక్ తాట తీయటానికి ప్రధాని మోడీ డిసైడ్ కావటం.. యుద్ధం లాంటివి కాకుండా.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి షాక్ ట్రీట్ మెంట్ ను పాక్ కు టేస్ట్ చూపించిన వైనంపై ప్రపంచ పెద్దన్న అయిన అమెరికా రక్షణ వర్గాలు ఏమనుకుంటున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిన్ లాడెన్ ను ఏసేసేందుకు తాము ఏదైతే ప్లాన్ చేశామో.. సరిగ్గా అదే తీరులో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు జరిపిన లక్షిత దాడిపై అమెరికా రక్షణ నిపుణులు ఏమనుకుంటున్నారు? వారు ఈ ఘటనను ఎలా విశ్లేషిస్తున్నారన్న అంశంపై ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

ఉగ్రవాదుల పీచమణచటానికి భారత్ ప్రయోగించిన సర్జికల్ స్ట్రైక్స్ సరైన చర్యగా అమెరికా రక్షణ వ్యవహారాల నిపుణులు అభిప్రాయ పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఆత్మరక్షణ కోసమే భారత్ ఈ చర్య తీసుకుందని అమెరికా రక్షణ నిపుణులు భావిస్తున్నా.. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు.

సరిహద్దులు దాటి తమ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రమూకను ఏరిపారేయటానికి భారత్ చేపట్టిన తాజా ఆపరేషన్ పై సీఐఏ మాజీ విశ్లేషకుడు బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ కు చెందిన బ్రూన్ రీడెల్ సమర్థించటం గమనార్హం. ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయటానికి అమెరికా ఇలాంటి దాడులు చాలానే చేసిందన్న విషయాన్ని రీడెల్ గుర్తు చేస్తున్నారు. లాడెన్ ఇష్యూలో ఒబామా సర్కారు బలమైన సందేశాన్ని పంపినట్లే.. తాజా చర్యతో భారత్ సైతం ఉగ్రవాదుల నియంత్రణ కోసం అవసరమైతే ఎంతవరకైనా సరే అన్నట్లుగా వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా.. భారత సైనికుల చర్యకు అమెరికా రక్షణ వర్గాలు సానుకూలంగా రియాక్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.