Begin typing your search above and press return to search.

ఐల‌య్య‌పై అంబికాకృష్ణ ఫైరింగ్ చూశారా?

By:  Tupaki Desk   |   26 Sep 2017 11:09 AM GMT
ఐల‌య్య‌పై అంబికాకృష్ణ ఫైరింగ్ చూశారా?
X
త‌న ప‌నేదో తాను చేసుకుని పోవడానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ముఖ విద్యావేత్త‌ - సామాజిక ఉద్య‌మ‌కారుడు కంచె ఐల‌య్య ప్ర‌స్తుతం రేపిన వివాదం ఇప్పుడ‌ప్పుడే స‌ద్దుమ‌ణిగేలా లేద‌నే చెప్పాలి. త‌న తాజా పుస్త‌కంలో ఆర్య‌వైశ్యుల‌ను స్మ‌గ్ల‌ర్లుగా అభివ‌ర్ణించిన ఐలయ్య‌... స‌ద‌రు సామాజికి వ‌ర్గానికి చెందిన వారితో పాటు ఇత‌ర సామాజిక వ‌ర్గాల వారిని కూడా ఆగ్ర‌హావేశాలకు గురి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ పుస్తకం విడుద‌లైన వెంట‌నే... ఐల‌య్యపై ఏకంగా భౌతిక దాడే జ‌రిగిపోయింది. అయితే త‌న కారు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో ఐల‌య్య ఆ దాడి నుంచి త‌ప్పించుకున్నా... ఆర్య‌వైశ్యుల మాట‌ల దాడి నుంచి మాత్రం త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ఇప్పుడు తెలుగు నేల‌లో ఎక్క‌డ చూసినా ఈ అంశంపైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అస‌లు ఐల‌య్య ఆర్య‌వైశ్యుల‌ను టార్గెట్ చేస్తూ ఆ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌ని అంతా త‌ల‌లు బద్ద‌లు కొట్టుకుంటున్నారు.

మ‌రోవైపు త‌మ‌ను తీవ్రంగా అవ‌మానించిన ఐల‌య్య క్ష‌మాప‌ణ చెప్పాల్సిందేన‌ని, ప్ర‌భుత్వం కూడా వెంట‌నే స్పందించి ఐల‌య్య పుస్త‌కాన్ని నిషేధించాల‌ని ఆర్య‌వైశ్యులు ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉద్య‌మాల‌కే రంగం సిద్ధ‌మ‌వుతోంది. అందుకు స‌న్నాహ‌కంగా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో జ‌రిగిన నిర‌స‌న ప్ర‌దర్శ‌న‌లో టీడీపీ సీనియ‌ర్ నేత అంబికా కృష్ణ పాల్గొన్నారు. ఐలయ్య పుస్తకంపై గాంధీ జయంతి నుంచి రెండో దశ ఉద్యమం మొదలు పెట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కంచ అయిలయ్య రాసిన పుస్తకంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబికా కృష్ణ డిమాండ్ చేశారు.

"న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ కట్టే వైశ్యులను అవమానిస్తావా? అంటూ అంబికా కృష్ణ నిప్పులు చెరిగాడు.. నువ్వెంత, నీ బతుకెంత? మీ అమ్మా - నాన్నలు నిన్ను చదివించినప్పుడు మావాడు మంచి ప్రయోజకుడు కావాలని చదివించి ఉంటారు. వాళ్లిప్పుడు బతికున్నారో లేదో తెలియదు. ఇప్పటి నీ స్థితిని చూస్తే వాళ్లు బాధపడతారు. దగ్గర దగ్గర నీకు 66 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో ఈ రాతలేంటయ్యా? అంబేద్కర్ చెప్పిన మాటలే మరిచావా? రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన చెప్పారు. కులాలు - మతాలు లేని దేశంగా ఈ భారతదేశం వెలుగొందాలి* అని ఐల‌య్య‌పై అంబికా కృష్ణ ఓ రేంజిలో ఫైర‌య్యారు.