లోకేశ్-రాజమౌళి కాంబినేషన్లో సినిమా?

Sat Sep 23 2017 22:01:30 GMT+0530 (IST)

సినిమా అంటేనే కథ - కల్పన. వాస్తవాల ఆధారంగా తీసిన సినిమాలైనా కూడా ఎంతో కొంత కల్పనను యాడ్ చేస్తారు. ఇక తెలుగు సినిమాను బాహుబలి చిత్రంతో ఎక్కడికో తీసుకెళ్లిన రాజమౌళి గురించి చెప్పుకున్నా కూడా ఆయనకూ పరిమితులు ఉన్నాయని అంగీకరించక తప్పదు. సినిమా కోసం కథలో భాగంగా వేసిన సెట్లకు మాత్రమే ఆయన సూచనలు చేసిన వ్యక్తి. పైగా అందులోనూ ఎన్నో ఆరోపణలు. ఖజురహో - ఫతేఫూర్ సిక్రీ నుంచి చిచెన్ ఇట్జా - సెయింట్ పీటర్ స్క్వీర్ వరకు అన్నిటినీ కాపీ కొట్టి మాహిష్మతి వర్చువల్ సామ్రాజ్యాన్ని సృష్టించారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ డిజైన్ల బాధ్యతలను చంద్రబాబాబు అప్పగించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విపక్ష వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అయితే ఏకిపడేస్తున్నారు.
    
ఈ సందర్బంగా ఆయన రాజమౌళి ప్రతిభను కొనియాడుతూనే చంద్రబాబు తిక్కను వెటకారమాడేశారు. చాలా చిన్న జీవి అయిన ఈగను కథా వస్తువుగా చూపించి హిట్ సినిమా తీసిన రాజమౌళి సామర్థ్యంపై ఎలాంటి అనుమానాలు లేవని.. అయితే అదంతా సినిమాకే పరిమితమని అంబటి అంటున్నారు. కావాలంటే చంద్రబాబు తనయుడు లోకేశ్ నో - ఆయన తనయుడినో - లేదంటే చంద్రబాబు బావమరిది హీరో బాలకృష్ణనో పెట్టి రాజమౌళితో సినిమా తీసుకోవాలని సూచించారు.
    
అంతేకాదు... సినిమాల్లో ఒక్క చేత్తో వందలమందిని కొట్టే సల్మాన్ ఖాన్ - షారూక్ ఖాన్ లను భారత్ - పాక్ యుద్ధానికి పంపించగలరా అని ప్రశ్నించారు. సినిమాను వాస్తవాన్ని కలపాలని చూస్తే దెబ్బతినడం ఖాయమని ఆయన హెచ్చరించారు.చేతిలో అధికారం ఉంది కదా అని బుర్రలో పుట్టిన పనులన్నీ చేస్తే దారుణంగా నష్టపోతామని - రాష్ర్టానికి అది తీవ్ర నష్టం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
    
సదావర్ది భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీరునూ ఆయన ఎండగట్టారు. దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాలసిన ప్రభుత్వమే వాటిని కాజేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఆ భూములను కాజేయాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ మాంసాహారి అని.. ఏదీ వదలకుండా అన్నీ తినేస్తున్నారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా ఆయనకు సిగ్గులేదన్నారు.