పాకిస్తాన్ కు షాకిచ్చిన ముఖేష్ అంబానీ

Mon Feb 18 2019 15:34:29 GMT+0530 (IST)

జమ్మూలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై భారతీయులు రగిలిపోతున్నారు.  ఉగ్రముఠాకు మద్దతునిస్తున్న పాకిస్థాన్ దేశం పై అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలందరూ గొంతెత్తుతున్నారు. మరోవైపు ప్రధాని కూడా ఉగ్ర సంస్థలపై ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్ తో కూడా వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.ఈ వ్యవహారంపై తాజాగా ఇండియాలోనే నంబర్ 1 కుబేరుడు అయిన రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ స్పందించారు. పాకిస్థాన్ తో తమ సంస్థకు ఉన్న వాణిజ్య సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు సంచలన ప్రకటన చేశారు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న పీసీఎల్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. పీసీఎల్ కు సంబంధించిన టీవీచానెళ్లు - కెమెరాలు - ఓబీ వ్యాన్లతో పాటు ఇతర వసతులను కల్పించేందుకు రిలయన్స్ ఈ ఒప్పందం చేసుకుంది. ఇకపై లీగ్ తో ఎలాంటి పొత్తు ఉండదని తెలిపింది.

ఈనెల 14న జమ్మూలోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై చలించిన ముఖేశ్ అంబానీ ఈ దాడికి కారణమైన జైష్ ఎ మహ్మద్ ముఠాకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్ర ముఠాలను పోషించే దేశాలతో వాణిజ్య సంబంధాలు అవసరం లేదని ముఖేశ్ పేర్కొన్నారు. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.

మరోవైపు పాకిస్థాన్ తో భారత్ కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఆ దేశానికి ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతి చేసే వస్తువులపై 200 కస్టమ్స్ డ్యూటీని విధించి షాక్ ఇచ్చిన  విషయం తెలిసిందే.