Begin typing your search above and press return to search.

కుబేరులలో `ఒకే ఒక్క‌డు` జెఫ్ బెజోస్!

By:  Tupaki Desk   |   17 July 2018 11:50 AM GMT
కుబేరులలో `ఒకే ఒక్క‌డు` జెఫ్ బెజోస్!
X
దిగ్గ‌జ‌ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అధినేత - అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్ మ‌రో స‌రికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా, బెజోస్ సంపద 150 బిలియన్‌ డాలర్లను దాట‌డంతో ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 150 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద క‌లిగిన ఒకే ఒక్క‌డిగా జెఫ్‌ బెజోస్ నిల‌వ‌డం విశేషం. 1982లో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా ప్రారంభించిన త‌ర్వాత ఇంత సంప‌ద క‌లిగిన ఒకే ఒక్క వ్యక్తి బెజోస్‌ కావడం విశేషం. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్ల‌డించిన వివరాల ప్ర‌కారం బెజోస్ నికర విలువ సోమవారం ఉద‌యానికి 150 బిలియన్ల‌కు చేరింది. ఈ క్ర‌మంలో బెజోస్....ప్ర‌పంచంలోనే రెండో అత్యంత సంప‌న్నుడైన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే సుమారు 55 బిలియన్ డాల‌ర్ల సంప‌ద‌ను అధికంగా క‌లిగి ఉన్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద కంటే బెజోస్ సంప‌ద ఎక్కువగా ఉంది. అంతేకాకుండా - ప్ర‌పంచ కుబేరులుగా పేరుగాంచిన వాల్టన్ రాజ‌వంశ కుటుంబానికి చెందిన 151.5 బిలియన్ డాల‌ర్ల్ సంప‌ద‌కు బెజోస్ అడుగు దూరంలో నిలిచారు.

అమెజాన్‌ 36 గంటల ప్రైమ్‌ డే సేల్స్‌ ప్రారంభమైన కొద్ది సేప‌టికే బెజోస్‌ ఆదాయం అమాంతం పెరిగిపోయింది. సోమవారం ఉదయానికి అమెజాన్‌ షేరు విలువ 1,841.95 డాలర్ల రికార్డు స్థాయికి దూసుకెళ్లింది. దీంతో జెఫ్ బెజోస్‌ సంపద 150 బిలియన్‌ డాలర్లను దాటింది. అయితే, కేవ‌లం 2018లోనే బెజోస్‌ సంపద 52 బిలియన్‌ డాలర్లు పెర‌గ‌డం విశేషం. బెజోస్‌ తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 95.3 బిలియన్‌ డాలర్లతో అత్యంత సంప‌న్నుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆ త‌ర్వాత వారెన్ బఫెట్ 83 బిలియన్ డాల‌ర్లతో మూడో స్థానంలో ఉన్నారు. 40 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ముకేష్ అంబానీ...భార‌తీయుల‌లో అత్యంత సంప‌న్నుడిగా ఉన్నారు. అయితే, 998లోనే బిల్ గేట్స్ కు 100 బిలియన్‌ డాలర్ల సంప‌ద ఉంది. అయితే, త‌న సంపదలో సింహ‌భాగాన్ని `బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌` ఫౌండేషన్ కు బిల్ గేట్స్ విరాళంగా ఇచ్చేశారు. దీంతో, ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఆ విరాళం ఇవ్వ‌కుంటే బిల్ గేట్స్ సంప‌ద‌ కూడా 150 బిలియన్‌ డాలర్ల క‌న్నా ఎక్కువ‌గా ఉండేద‌ని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.