బుగ్గకార్లకు చెక్ చెప్పిన సీఎం

Mon Mar 20 2017 12:06:16 GMT+0530 (IST)

కొంతమంది అధికారంలోకి వస్తూనే.. వినూత్నమైన ఎజెండాతో వస్తుంటారు. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీరు ఇప్పుడు అలాంటి బాటలోనే నడుస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో అధికారాన్ని చేపట్టిన ఆయన.. తన తొలి క్యాబినెట్ మీటింగ్లోనే సంచలన నిర్ణయాల్ని తీసుకొని.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలన్న వెంటనే గుర్తుకు వచ్చే అశ్రిత పక్షపాతం.. అవినీతి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరుకు చెక్ పెట్టాలని.. వినూత్న విధానాలతో సాగాలన్నట్లుగా ఉంది అమరీందర్ తీరు చూస్తుంటే.తొలి మంత్రివర్గ సమావేశంలోనే.. పలు కీలక నిర్ణయాల్ని ప్రకటించిన ఆయన.. మంత్రులకు ఉండే బుగ్గలు ఇకపై ఉండవని తేల్చేశారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులందరికి కార్ల మీద పెట్టే బుగ్గల్నితీసేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. గవర్నర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. న్యాయమూర్తులకు మాత్రం మినహాయింపును ఇచ్చారు.

మంత్రులు.. సీనియర్ అధికారుల విదేశీ పర్యటనల మీద పరిమితులు విధించటంతో పాటు.. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ.. శిలాఫలకాల ఆవిష్కరణలోనూ మంత్రులు.. ఎమ్మెల్యేలు పాల్గొనరంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రూ.100 కోట్లు కానీ రూ.200 కోట్లు కానీ ప్రాజెక్టు శిలాఫలకాలపై మంత్రులు.. ఎమ్మెల్యేల పేర్లను ఉంచమన్న నిర్ణయాన్ని వెల్లడించారు. డ్రగ్ మాఫియాను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన పంజాబ్ ముఖ్యమంత్రి సరికొత్త సంస్కరణలకే కాదు.. దేశ వ్యాప్తంగా మిగిలిన ముఖ్యమంత్రులకు కొత్త స్ఫూర్తిగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. తొలి క్యాబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలకు కట్టుబడి ఉండటం.. అదే తరహాలో పాలనలో కానీ ముద్ర చూపిస్తే.. పంజాబ్ సీఎం దేశానికి సరికొత్త రోల్ మోడల్ గా మారతారనడంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/