Begin typing your search above and press return to search.

కృష్ణమ్మ లోగిలిలో కొంగొత్త అందాలు

By:  Tupaki Desk   |   2 Aug 2015 11:40 AM GMT
కృష్ణమ్మ లోగిలిలో కొంగొత్త అందాలు
X
ఏపీ కొత్త రాజధాని కృష్ణానది ఒడ్డున ఏర్పడుతున్న సంగతి తెలిసిందే... రాజధాని చుట్టూ గుంటూరు, కృష్ణా జిల్లాలున్నాయి. ఈ రెండు జిల్లాలూ పర్యాటకంగా ప్రసిద్ధి చెందినవే. ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే... కొత్త రాజధాని అమరావతిలోనూ పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తుండడంతో వీటిలో చాలావరకు మరింత ప్రాచుర్యం పొందే అవకాశముంది. భవిష్యత్తులో ఇవి మరింత ప్రసిద్ధిగాంచుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి సమీపంలో కృష్ణాజిల్లాలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం..

కొండపల్లి ఖిల్లా, రెల్లిగడ్డిలంక, హంసలదీవి, మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీకాకుళేంద్రస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అవనిగడ్డ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం , భవానీ ద్వీపం, గాంధీకొండ ఇవన్నీ కృష్ణా జిల్లాలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతాలే. వీటన్నింటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి .కొండపల్లి ఖిల్లాలో పర్యాటకుల కోసం రిసార్టులు ఏర్పాటుచేయనున్నారు. కింద నుంచి కోట పైకి రోప్‌ వే మార్గం ఏర్పాటు చేస్తున్నారు.

రెల్లిగడ్డలంక

ఇబ్రహీంపట్నం కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో ఉంది ఇది. దాదాపు 700 ఎకరాల్లో విస్తరించిన రెల్లిగడ్డి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ కాటేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో వుండే ఈ ప్రాంతాన్ని పడవలో వెళ్లడం మంచి అనుభూతినిస్తుంది.

దివిసీమ

ఆహ్లాదానికి చిరునామాగా నిలుస్తున్న దివిసీమను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూచిపూడి నుంచి మొదలయ్యే దివిసీమలో మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీకాకుళేంద్రస్వామి, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అవనిగడ్డ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు హంసలదీవి కూడా వుంది. వీటన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ ను అభివృద్ధి చేయాలన్నది అధికారుల ప్లాన్‌.

హంసలదీవి

బంగాళాఖాతంలో కృష్ణా నది కలిసే హంసలదీవి ఉంది. హంసలదీవిలో బోటింగ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడ నుంచి ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భవానీద్వీపం

విజయవాడలోని భవానీద్వీపం సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. భవానీద్వీపంలోని 20 ఎకరాల్లో శిల్పారామం అభివృద్ధి చేస్తున్నారు.

ప్లానెటోరియం

గాంధీకొండపై ఈ ప్లానెటోరియం ఉంది. బిర్లా సంస్థ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.