అమరావతి డిజైన్లు వచ్చేశాయి..

Thu Oct 19 2017 13:27:18 GMT+0530 (IST)

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్ల విషయం కొలిక్కి వచ్చింది. ఈ డిజైన్ల బాధ్యత చూస్తున్న నార్మన్ ఫోస్టర్ సంస్థ కొద్దికాలం క్రితం కీలకమైన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్ తోపాటు అసెంబ్లీ - హైకోర్టు - సచివాలయం డిజైన్లు రూపొందించి ఇచ్చినప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేయని సంగతి తెలిసిందే. వజ్రాకృతి - స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసే దశలో వాటికి నో చెప్పి సినీ దర్శకుడు రాజమౌళిని రంగంలోకి దింపి ఆయన సలహా ప్రకారం డిజైన్లు ఇవ్వాలని ప్రభుత్వం నార్మన్ ఫోస్టర్ సంస్థను ఆదేశించింది.ఏపీ ప్రభుత్వం ఆదేశాలు - రాజమౌళి సలహాల నేపథ్యంలో నార్మన్ ఫోస్టర్ సంస్థ తాజాగా మరో 13 డిజైన్లను రూపొందించింది. వాటిని సోషల్ మీడియాలో విడుదల చేసి ప్రజల అభిప్రాయం కోరింది. ఫేస్ బుక్ - ట్విట్టర్ తోపాటు సీఆర్ డీఏ వెబ్ సైట్ లో పెట్టిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు వారంపాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. మరోవైపు ఈ గడువు ముగిసే నాటికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ లో పర్యటించనున్నారు. ఈనెల 25 - 26 తేదీల్లో లండన్ లో ఫోస్టర్ కార్యాలయంలో ఈ డిజైన్లను బాబు పరిశీలించి తన అభిప్రాయం చెప్పనున్నారు. అయితే ఈ డిజైన్లను ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు 9రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మొదటి రోజు చికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు చికాగో చేరుకుని సీఎంకు స్వాగతం పలికారు. మూడు దేశాల పర్యటన కోసం సీఎం చంద్రబాబు పదిరోజుల పాటు అమెరికా - దుబాయ్ - లండన్ లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ - ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. చివరి రెండు రోజులు లండన్ టూర్ లో రాజధాని డిజైన్లు ఫైనల్ చేసే అవకాశం ఉంది.