Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో భ‌వ‌నాలు నిర్మించ‌కూడ‌దా?

By:  Tupaki Desk   |   30 Aug 2015 5:07 AM GMT
అమ‌రావ‌తిలో భ‌వ‌నాలు నిర్మించ‌కూడ‌దా?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం కంటే ముందు నుంచే వార్త‌ల్లో అంశంగా నిలుస్తోంది. రాజ‌ధానికి భూ స‌మీక‌ర‌ణ నుంచి మొదలుకొని నిర్మాణంలో భాగ‌స్వామ్యం అయ్యే సంస్థ‌ల వ‌ర‌కు అన్ని అంశాల్లోనూ అమ‌రావతిది అగ్ర‌స్థాన‌మే. స‌మ‌స్య‌ల‌న్ని దాటుకొని... సీడ్ కేపిట‌ల్ డిజైన్‌ ను ఆమోదించుకొని.... ఉత్సాహంలో ఉన్నారు అనుకుంటే ఆ త‌ర్వాత మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. రాజ‌ధాని నిర్మాణ ప్రాంతం నదీతీరాన ఉన్నందున నేలలు లూజ్‌ సాయిల్‌ తరహావని, ఇవి భారీ నిర్మాణాలకు అనుకూలంగా ఉండవనే అభిప్రాయాలు ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌చ్చాయి. త‌మ‌దైన శైలిలో కొంద‌రు మేధావులు ఈ వియాల‌పై విశ్లేష‌ణ చేశారు.

అయితే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మాణం కోసం రెడీ అయిన చంద్ర‌బాబు స‌ర్కారు ఈ విష‌యాన్ని స‌వాలుగా తీసుకుంది. కేపిటల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీ(సీఆర్‌ డీఏ)ని రంగంలోకి దించింది. సీడ్‌ క్యాపిటల్‌ లోని వివిధ ప్రదేశాల్లో భూమి స్వరూప స్వభావాలను క్షుణ్ణంగా తెలుసుకునే ఉద్దేశంతో సీఆర్ డీయే మట్టి పరీక్షలు నిర్వహించింది. ఆగస్టు రెండో వారంలో ప్రారంభమైన సర్వే 15 రోజులపాటు సాగింది. సర్వేలో భాగంగా దాదాపు కిలోమీటరుకు ఒకటి చొప్పున సీడ్‌ క్యాపిటల్‌ లోని అన్ని ప్రదేశాలూ కవరయ్యేలా మొత్తం 26 బోరు పాయింట్లను గుర్తించారు. వీటిల్లో 24 తాళ్లాయిపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం పరిధుల్లో ఉండగా మరో రెండు ఉద్దండరాయునిపాలెం ఎదుట కృష్ణానదిలోని లంకభూముల్లో ఉన్నాయి. ఒక్కొక్క బోరును 15 మీటర్ల లోతు వరకు తవ్వి...భూములను పరిశీలించారు.

మొత్తంగా సుదీర్ఘంగా చేసిన‌ సర్వే పూర్తయింది. అమరావతిలోని నేలలు ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ప‌క్క‌గా ఉంద‌ని...ఏ త‌ర‌హా నిర్మాణాలు అయిన చేప‌ట్టుకోవ‌చ్చ‌చని తేల్చేశారు. దీంతో ప్ర‌భుత్వానికి పెద్ద ఉప‌శ‌మ‌నం ద‌క్కిన‌ట్ల‌యింది.