Begin typing your search above and press return to search.

అమ‌ర్‌సింగ్‌.. రాజ‌కీయ వేశ్య‌నా?

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:28 PM GMT
అమ‌ర్‌సింగ్‌.. రాజ‌కీయ వేశ్య‌నా?
X
రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, ప్య‌త్యారోప‌ణ‌లు కామ‌న్‌. ఈ విష‌యంలో ఎంత త‌ల‌పండిన నేత‌ల‌కైనా మిన‌హాయింపు ఉండ‌దు. అదేవిధంగా నిన్న బండ‌బూతులు తిట్టుకుని నేడు భుజాలు రాసుకున్న నేత‌లనూ కూడా పాలిటిక్స్‌లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇది కూడా కామ‌నే! అయితే, తాజాగా యూపీకి చెందిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, మేధావిగా త‌న‌ను తాను చెప్పుకునే అమ‌ర్ సింగ్ మాత్రం సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి తెచ్చారు. త‌న‌ను రాజ‌కీయాల్లో ఎంతో మంది వాడుకుని వ‌దిలేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న ఒక‌ప్ప‌టి యూపీ సీఎం, స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ములాయం సింగ్ యాద‌వ్ అస‌లు రూపం ఇదీ అంటూ మీడియాకెక్కారు. అనేక విష‌యాలు వెల్ల‌డించారు. ఈ క్రమంలోనే త‌న‌ను రాజ‌కీయ వేశ్య‌లాగా ములాయం వాడుకుని వ‌దిలేశార‌ని ఆయ‌న‌ నిప్పులు చెరిగారు.

మ‌రి అమ‌ర్‌సింగ్‌ అంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఎందుకు చేశారు? ఆయ‌న బాధ ఏమిటి? ఒక‌ప్పుడు ఒక కంచంలో తిని, ఒక కారులో తిరిగిన ములాయంపై ఎందుకంత నిప్పులు చెరిగారు? చూద్దాం ప‌దండి.. ఒక‌ప్పుడు యూపీలో చ‌క్రం తిప్పిన నేత అమ‌ర్ సింగ్‌. ములాయంకు రైట్ హ్యాండ్ కూడా. అలాంటినేత దాదాపు ఏడ నెల‌ల కింద‌ట జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల అనంత‌రం మీడియా ముఖం చూడ‌లేదు. అంత‌కాదు, త‌న అడ్రెస్ కూడా దొర‌క్కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఇప్ప‌డు మీడియా ముందుకు వ‌చ్చారు. వ‌చ్చీ రావ‌డంతోనే ములాయంపైనే గురి పెట్టారు. త‌న‌ను రాజ‌కీయ వేశ్య‌గా ములాయం వాడుకుని ఆనందించార‌ని చెప్పారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే..

ములాయం కుటుంబంలో చిచ్చు రేగి మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ ఎస్పీ పార్టీ పగ్గాలు అందుకున్న సమయంలో ములాయం, రామ్‌గోపాల్‌ యాదవ్‌ ఎవరికీ తెలియకుండా త‌న‌ను కలిసేందుకు ప్రయత్నించారని అమర్‌సింగ్ చెప్పుకొచ్చారు. ఒకదశలో క‌న్న‌కొడుకు అఖిలేశ్‌కు భయపడిన ములాయం, రామ్‌గోపాల్‌ యాదవ్‌లు రాత్రి సమయంలో దొడ్డిదారిగుండా.. వచ్చి త‌న‌ను కలుస్తామని చెప్పిన‌ట్టు తెర‌వెనుక విష‌యాల‌ను బ‌హిర్గ‌తం చేశారు. అంతేకాక తమ మధ్య జరిగే సమావేశాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని వారు కోరినట్లు తెలిపారు. ములాయంతో ఉంటే ఎటువంటి రాజకీయ భవిష్యత్‌ ఉండదని.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి తన వద్ద వాపోయారని చెప్పారు.

ములాయం సింగ్‌ తనను ఒక రాజకీయ వేశ్యలా వాడుకునేందుకు ప్రయత్నించారని, కొడుకునే లైన్‌లో పెట్టుకోలేక పోయిన ఆయ‌న త‌నపై వీర విహారం చేశార‌ని అమర్‌ సింగ్‌ సంచలన ఆరోపణ చేశారు. ములాయంకు నీతి లేద‌ని, అత‌ని కంటే ఆయ‌న కొడుకే బెట‌ర్ అన్న విధంగా అమ‌ర్ సింగ్ చెప్పుకొచ్చారు. పార్టీ కోసం తాను స‌ర్వ‌స్వం ధార పోశాన‌ని వెల్ల‌డించారు. అయినా కూడా త‌న‌ను న‌డిరోడ్డుపై నిల‌బెట్టార‌ని చెప్పారు. ప్రస్తుతం తాను సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగుతున్నాని అన్నారు. అయితే పార్టీలో ఎటువంటి పాత్రా పోషించడం లేదని చెప్పారు. మొత్తానికి ఇప్పుడు అమ‌ర్ సింగ్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించారో ఎవ‌రికీ అర్ధం కాలేదు. ములాయంను ఒక‌ప్పుడు `నేతాజీ` అని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసింది అమ‌ర్ సింగే! అయితే,ఇప్పుడు ఆయ‌నే ఇలా భారీగా ఎక్కిదిగడం వెనుక ఏమై ఉంటుంద‌నే స‌స్పెన్స్ మాత్రం వీడాల్సి ఉంది. ఇక‌, అమ‌ర్ వ్యాఖ్య‌ల‌పై ములాయం ఎలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.