Begin typing your search above and press return to search.

బాబును దెబ్బేస్తున్న ‘‘తమ్ముళ్లు’’

By:  Tupaki Desk   |   28 Sep 2016 4:59 PM GMT
బాబును దెబ్బేస్తున్న ‘‘తమ్ముళ్లు’’
X
ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు టైం ఏం బాగోలేన్నట్లుగా కనిపిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా ఆయనకు ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. తనకు బలం కావాల్సిన తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడాయనకు పెద్ద బలహీనతగా మారుతున్నారు. ఒకరి తర్వాత ఒకరిపైన అన్నట్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బాబుపై ఒత్తిడి పెరిగిపోతుందన్న మాట వినిపిస్తోంది.

మొన్నటికి మొన్న ఏపీ తమ్ముళ్లు కమ్ పారిశ్రామికవేత్తలైన సుజనా.. గల్లా జయదేవ్ సహా పలువురు పారిశ్రామికవేత్తలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టటమే కాదు.. వాటి విస్తరణ విషయంలో కొత్త పెట్టుబడులు పెడుతున్న వైనం ఈ మధ్యనే వెలుగులోకి రావటం సీమాంధ్రులు షాక్ తినే పరిస్థితి. ఓపక్క హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉందని చెబుతూ.. కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ పరమాన్నం అన్నట్లుగా ఫీలవుతున్న నేతలు.. వ్యక్తిగతంగా పెట్టబడులు హోదా ఉన్న రాష్ట్రాల్లో పెట్టటం బాబు సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసింది.

ఇది సరిపోదన్నట్లుగా.. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణపై వచ్చిన ఆరోపణలు కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. ఓబులవారిపల్లి – కృష్ణపట్నం మధ్య నిర్మిస్తున్న కొత్త రైల్వేలైన్ నిర్మాణం పనులు సక్రమంగా సాగాలంటే తనకు రూ.5కోట్లు చెల్లించాలంటూ వెంకటగిరి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న కంపెనీకి చెందిన ప్రతినిధి చెప్పటం సంచలనంగా మారింది. ఇంత ఓపెన్ గా అధికారపార్టీ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు వస్తే చంద్రబాబు కిమ్మనకుండా ఉండటాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఒకవేళ తమ ఎమ్మెల్యే తప్పు లేనప్పుడు ఆ విషయాన్ని వివరించినా సరిపోయేది. అలాంటిదేమీ లేకుండా.. కామ్ గా ఉంటున్న బాబు తీరును తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి (గుంటూరు పశ్చిమ) ఇంటిపై ఐటీ శాఖాధికారులు దాడులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు చెందిన ఆస్తులున్న బెంగళూరు.. హైదరాబాద్.. గుంటూరులలోని ఇళ్లు.. కార్యాలయాలపైనా దాడులు చేసినట్లు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే మోదుగులకు సంబంధించిన పలు కీలక పత్రాల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. వీటిపై తెలుగు తమ్ముడికి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్న అంశాలు అధికార పార్టీ ఇమేజ్ ను తీవ్రంగా ప్రభావితం చేయటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/