Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ : ఆళ్లగడ్డపై నిలిచేదెవరో..?

By:  Tupaki Desk   |   23 March 2019 11:44 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ : ఆళ్లగడ్డపై నిలిచేదెవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: ఆళ్లగడ్డ

టీడీపీ: భూమా అఖిలప్రియ
వైసీపీ: బీజేంద్రారెడ్డి

కర్నూలు జిల్లాలో ప్రముఖంగా చెప్పుకునే నియోజకవర్గం ఆళ్లగడ్డ. ఫ్యాక్షనిజానికి - ముఠాకక్షలకు నియోజకవర్గం పెట్టింది పేరు.ఈ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మధ్య ఏళ్లుగా వైరం సాగుతోంది. ఒకప్పుడు భూమా - గంగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఫ్యాక్షన్‌ గొడవలు లేకున్నా రాజకీయ వైరం మాత్రం అలాగే సాగుతోంది. భూమా - గంగుల మూడోతరం వారసులు ఈ ఎన్నికల్లో ఒకరికి పోటీగా మరొకరు నిలబడడంతో రాజకీయంగా వేడి మరోసారి రాజుకుంది..

*ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్ర:

ఓటర్లు: రెండు లక్షల 9 వేలు

మండలాలు: ఆళ్లగడ్డ, చాదలమర్రి రుద్రవరం, సిరివెల్ల, వియ్యలవాడ ఎండేర్లపాడు

ఆళ్లగడ్డ నియోజకవర్గం 1956లో ఏర్పడింది. మొదటిసారి కాంగ్రెస్‌ నాయకుడు సిట్ట జయరాజ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1989 నుంచి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా ఆ పార్టీదే హవా సాగుతోంది. 1989లో భూమా శేఖర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి, మొన్నటి వరకు భూమ అఖిలప్రియ ప్రాతినిథ్యం వహించారు. భూమా కుటుంబం ఏ పార్టీలో ఉన్న వారినే ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు.

* అఖిలప్రియకు అంత ఈజీ కాదు..

2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన భూమా శోభానాగిరెడ్డి ప్రచారం చేసి ఇంటికెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక వచ్చింది.. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా శోభానాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తండ్రి నాగిరెడ్డితో పాటు అఖిలప్రియ టీడీపీలో చేరారు. కొంతకాలం తరువాత నాగిరెడ్డి మరణించడంతో అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు.

* అనుకూలతలు:

-ప్రజల్లో ఉన్న అభిమానం. ఏడుసార్లు భూమా కుటుంబానిదే విజయం

- అభివృద్ధి పనులు చేపట్టడం

-టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం

* ప్రతికూలతలు:

-మంత్రి అయ్యాక ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణ

-బంధువు మేనమాన వైసీపీలో చేరడం

-తండ్రి నాగిరెడ్డి మిత్రులు అఖిలప్రియ పాలనపై అసంతృప్తి

* బిజేంద్రారెడ్డికి అఖిలప్రియపై వ్యతిరేకతే బలం

ఆళ్లగడ్డ నియోజకవర్గలో రెండు కుటుంబాల్లో గంగుల కుటుంబం ఒకటి. నువ్వా నేనా అన్నట్లుగా భూమా కుటుంబానికి ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉంటున్నారు. భూమా కుటుంబం వైసీపీలో చేరినప్పుడు గంగుల కుటుంబం టీడీపీలో ఉండడం ఇలా ప్రత్యర్థిగానే ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి గంగుల వారసుడు బిజేంద్రారెడ్డి బరిలో ఉన్నారు. రాజకీయ చరిత్ర ఘనంగానే ఉన్న బిజేంద్రారెడ్డి ఈసారి ఎలాగైన గెలుపొందుతానన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా ఈ ఐదేళ్లలో వైసీపీని వీడి టీడీపీ లో చేరిన భూమా అఖిలప్రియపైన వ్యతిరేకత.. టీడీపీపై పెల్లుబుకుతున్న ఆగ్రహమే తనను గెలిపిస్తుందని బిజేంద్రారెడ్డి ధీమాగా ఉన్నారు.

* అనుకూలతలు:

-గంగుల కుటుంబం వారసుడు కావడం

-నాగిరెడ్డి మరణం తరువాత నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం

-రాంపుల్లారెడ్డి వర్గం మద్దతు సంపాదించడం

* ప్రతికూలతలు:

-మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం
-గంగుల కటుంబ సభ్యులు కొంత మంది టీడీపీలో కొనసాగుతుండడం

*అంతిమంగా వైసీపీకే మొగ్గు..

కర్నూలులో ప్రస్తుతం వైసీపీ బలంగా ఉంది. ఎవ్వరూ నిలిచినా గెలిచాలాగానే ఉన్నారు. భూమా ఫ్యామిలీ కూడా వైసీపీనుంచే గెలవడం విశేషం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో భూమా కుటుంబాన్ని ఏడుసార్లు గెలిపించిన ప్రజలు ఈసారి మాత్రం ఆ అవకాశం ఈ కుటుంబానికి ఇవ్వరనే ప్రచారం సాగుతోంది. అఖిలప్రియ మంత్రి అయ్యాక పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. అలాగే ఇక్కడ ప్రత్యర్థి గంగుల కుటుంబం ఏడాదిన్నరగా పరచయాలతో పట్టుసాధిస్తోంది. వరుసగా ఓడిపోయారన్న సానుభూతి వీరికి కలిసివస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు జిల్లాపై ముఖ్యంగా ఆళ్లగడ్డపై ప్రత్యేక దృష్టి సారించి ఆళ్లగడ్డను చేజిక్కించుకునేలా స్కెచ్‌ గీస్తున్నాడు. దీంతో ఆళ్లగడ్డ ఈసారి వైసీపీ గడ్డగా మారే అవకాశాలున్నాయంటున్నారు.