Begin typing your search above and press return to search.

ఆళ్లకు మించి ధరవస్తేనే..వైకాపాకు మేలు!

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:18 PM GMT
ఆళ్లకు మించి ధరవస్తేనే..వైకాపాకు  మేలు!
X
సదావర్తి భూముల విషయం ఒక కొలిక్కి వస్తోంది. గురువారం ఈ భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించాల్సి ఉంది. ఈ వేలాన్ని నిలుపుదల చేయడానికి జరిగిన ప్రయత్నాలన్నీ సుప్రీం కోర్టు సాక్షిగా తేలిపోయాయి. ఇందుకోసం దాఖలైన పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. వేలం జరగాల్సిందే అని తీర్పు చెప్పింది. అలాగే ప్రతివాది ఆళ్ల కూడా వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. అయితే నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆళ్ల ఈ భూములకోసం చెల్లించడానికి సిద్ధపడ్డ 27 కోట్ల రూపాయలకంటె ఎక్కువ ధరకు అమ్ముడైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషకులు - ప్రజలు భావిస్తున్నారు.

సదావర్తి భూములు అంటే.. మొత్తం 82 ఎకరాలు. ఈ భూములను తెలుగుదేశం ప్రభుత్వం కేవలం 22 కోట్ల రూపాయలకు కొందరికి విక్రయించేసింది. ఆ కొందరు.. తెలుగుదేశం పార్టీ మనుషులే. అధికారం వారి చేతిలో ఉన్నది గనుక.. వందల కోట్ల విలువైన భూముల్ని కారుచౌకగా పొందారంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన కేసు పర్యవసానంగా.. ఇప్పుడు వేలం జరుగుతోంది. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు ఆళ్ల 27 కోట్లకు తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు.

అయితే తాజాగా సుప్రీం కోర్టు వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. వేలం బాగా జరిగి ఆళ్ల చెల్లించడానికి సిద్ధపడిన మొత్తానికంటె పెద్ద మొత్తానికి ధర తేలితే.. అది వైఎస్సార్ కాంగ్రెస్ కే మంచి జరిగినట్లు అవుతుంది. నిజానికి హైకోర్టులో వాదనల సందర్భంగా.. అప్పట్లో న్యాయమూర్తులు.. ప్రభుత్వం చెబుతున్నట్లుగా 22 కోట్లకు 5 కోట్లు ఎక్కువ చెల్లించి.. తీసుకోవాలని చెప్పినప్పుడు.. తన వద్ద అంత మొత్తం లేదని, కానీ కొనుగోలుదార్లను తేగలనని ఆళ్ల కోర్టుకు చెప్పారు. ఆ తర్వాత కోర్టు చెప్పిన సొమ్ము ప్రభుత్వానికి చెల్లించారు. ఇప్పుడు పాట సవ్యంగా జరిగి.. ధర వందల కోట్లకు వెళితే.. ఏపీ ప్రభుత్వ ఖజానాకు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఎక్కువ మొత్తం జమ అయినట్లుగా లెక్క తేలుతుంది. అంటే అధికార తెలుగుదేశం పార్టీ సర్కారుకు దఖలు పడాల్సిన సొమ్మును అక్రమంగా కాజేయాలని చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ తమ పోరాటం ద్వారా సర్కారు ఖజానాకు సంపాదించి పెట్టినట్లుగా వారికి మంచిపేరు వస్తుంది.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి మడమ తిప్పని పోరాటం కారణంగానే.. సదావర్తి భూముల వ్యవహారం ఇవాళ వేలం వరకు వచ్చిందన్నది వాస్తవం. కాకపోతే.. వేలంలో ఎంతవరకు వెళ్తుందనేదాన్ని బట్టి.. తెదేపా నాయకుల అక్రమాలు వెల్లడవుతాయి.