ఈసీకి ఆళ్ల కంప్లైంట్!... ఠాకూర్ కు ఊస్టింగేనా?

Thu Mar 14 2019 23:03:06 GMT+0530 (IST)

ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైపోయింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించేసింది. ఈ నెల 18న ఎన్నికల క్రతువులో భాగంగా కీలకమైన నోటిఫికేషన్ కూడా రానుంది. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించేసిన అన్ని పార్టీలు... షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆ కసరత్తును మరింతగా ముమ్మరం చేసేశాయి. ఇప్పుడు అన్ని పార్టీల కార్యాలయాలు కూడా ఆశావహుల వినతులు నిరాశే మిగిలిన నేతల గగ్గోలుతో బిజీబిజీగా మారిపోయాయి. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కీలక నేత - గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేడు సంచలన అడుగు వేశారు.రాష్ట్రంలో కీలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ డీజీపీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ను తక్షణమే డీజీపీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాల్సి ఉండగా... అధికార పార్టీ టీడీపీకొ కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్న ఠాకూర్ కారణంగా ఆ పరిస్థితి లేదన్నది ఆళ్ల వాదన. ఇదే వాదనలో మొన్నామద్య ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆర్పీ ఠాకూర్తో పాటు మరో ఇద్దరు కీలక పోలీసు అధికారులను తక్షణమే బదిలీ చేయాలని కోరారు.

జగన్ ఫిర్యాదుపై అప్పటికప్పుడే స్పందించినట్లుగా కనిపించిన ఈసీ... ఠాకూర్ ను తప్పిస్తే... ఆ స్థానానికి సరిపోయే ఐపీఎస్ అధికారుల జాబితాను పంపాలంటూ ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ పోలీసు అధికారుల వివరాలను కూడా పంపింది. అయితే ఆ తర్వాత ఏమైందో గానీ... ఠాకూర్ ను తొలగింపు పక్కన పడిపోయింది. ఈ నేపథ్యంలో మరోమారు ఈసీకి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆళ్ల ఫిర్యాదు చేశారు. మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆళ్ల ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.