ఎన్నికల వేళ!... హోదా అటకెక్కేసిందా?

Mon Mar 25 2019 12:04:35 GMT+0530 (IST)

ఏపీకి ప్రత్యేక హోదా...  ఈ ఎన్నికల్లో ఏపీలోని దాదాపుగా అన్ని పార్టీలకు ఆయుధంగానే మారుతుందని అనుకున్నారు. అన్ని పార్టీలు కూడా ఆ మేరకే వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు దాఖలైపోతున్నాయి. ప్రచారం పతాక స్థాయికి చేరిపోయింది. అయితే అనూహ్యంగా ప్రత్యేక హోదా అంశం వినిపించడమే మానేసింది. ఆ మాటను దాదాపుగా అన్ని పార్టీలు కూడా అటకెక్కించేశాయనే చెప్పక తప్పదు. ఇదేంటీ... ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా అన్ని పార్టీలు రచించుకున్న వ్యూహాలు ఏమయ్యాయి? ఇప్పుడిదే ప్రశ్న ప్రతి సామాన్యుడిలోనూ వినిపిస్తోంది. కీలక ఎన్నికల వేళ ఇలా ముందస్తుగా రచించుకున్న వ్యూహం ప్రకారం అన్ని పార్టీల నోట వినిపించాల్సిన ప్రత్యేక హోదా మాట... ఒక్క పార్టీ నోట కూడా వినిపించడం వెనుక పెద్ద తతంగమే ఉందని చెప్పక తప్పదు. కొన్ని పార్టీలు ప్రత్యేక హోదా డిమాండ్ ను ఉద్దేశపూర్వకంగానే పక్కనపడేయగా... మరికొన్ని పార్టీలు అనివార్యంగా ఆ మాటను అటకెక్కించక తప్పలేదు.ఈ తరహా మార్పునకు గల కారణాల్లోకి వెళితే... ఆసక్తికర అంశాలు కనిపించక మానవు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా - తీవ్ర ఆర్థిక లోటుతో ఏర్పడ్డ ఏపీకి ప్రత్యేక హోదాతో నష్ట నివారణ చర్యలు చేపడతామని నాటి యూపీఏ సర్కారు చెప్పుకొచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో యూపీఏ ఓడిపోగా... కొత్తగా ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీలో అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా గ్యారెంటీ అన్న మాట వినిపించింది. అయితే దాదాపుగా నాలుగేళ్ల పాటు బీజేపీతోనే కలిసి సాగిన టీడీపీ ప్రభుత్వం... ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని హోదా కంటే ప్యాకేజీనే బెటరని కొత్త వాదన వినిపించింది. అయితే ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా రాకపోయేసరికి... ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ యూటర్న్ తీసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదానే ఇవ్వాలని అందుకు నిరాకరించిన ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లుగా కొత్త డ్రామా ప్లే చేసింది.

అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరు సాగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... హోదా ఇవ్వనందుకు నిరసనగా తన ఎంపీలతో రాజీనామాలు చేయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒకటి అరా సార్లు హోదా మాట వినిపించి బీజేపీ సర్కారుపై నిప్పులు చెరిగేసి ఊరుకున్నారు. మొత్తంగా ఈ మూడు పార్టీలు కూడా ప్రత్యేక హోదా నినాదాన్నే ప్రధానాస్త్రంగా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. తీరా నోటిఫికేషన్ రావడానికి ఓ వారం పది రోజుల ముందు టీడీపీ వ్యూహం మార్చేసింది. ప్రత్యేక హోదాను నీరుగార్చిన తనను జనం నమ్మరనుకుందో?  లేదంటే.. ఆ మాట చెబితే తనకే ఎదురు దెబ్బలు తప్పవని భావించిందో తెలియదు గానీ... హోదాను పక్కనపెట్టేసి... కేసీఆర్ జగన్ దోస్తీ అంటూ కొత్త వాదనను తెర పైకి తీసుకువచ్చి దానిపైనే ఆరోపణలు గుప్పిస్తూ సాగింది. ఈ క్రమంలో హోదాను అటకెక్కించడంలో టీడీపీ తనదైన మార్కును చూపిందనే చెప్పాలి.

ఇక టీడీపీతో లోపాయికారీ ఒప్పందాలను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ కూడా హోదా మాట వినిపించడం మానేసి జగన్ ను దూషించడమే పనిగా కొనసాగుతున్నారు. ఇలాంటి కీలక తరుణంలో హోదాపై మాట్లాడాలని ఉన్నా... టీడీపీ - జనసేనలు సంధిస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వైసీపీ కూడా అనివార్యంగా హోదాను పక్కన పెట్టేయక తప్పలేదు. మొత్తంగా హోదానే ఈ మూడు పార్టీలకు ప్రధానాస్త్రంగా మారతాయని భావిస్తే... టీడీపీ ప్లే చేసిన గేమ్ ప్లాన్ తో దానితో పాటు మిగిలిన రెండు పార్టీలు కూడా హోదాను పలకడమే మానేశాయని చెప్పాలి. ఇక కాంగ్రెస్ - బీజేపీ - వామపక్షాలు కూడా తమదైన వ్యూహాలతో ఈ మాటను పలికేందుకే వెనుకాడుతున్నాయి. మొత్తంగా ప్రత్యేక హోదా పక్కనపడిపోగా... ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలే ఎన్నికల అస్త్రాలుగా మారిపోయాయని చెప్పాలి.