Begin typing your search above and press return to search.

ఏపీలో ప్ర‌త్యేక పోరాటం రూపు ఇది

By:  Tupaki Desk   |   5 May 2016 1:59 PM GMT
ఏపీలో ప్ర‌త్యేక పోరాటం రూపు ఇది
X
ప్రత్యేక హోదా పై కేంద్రం చేతులెత్తేయడంతో ఏపీలో రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌ ల‌తో ఆందోళనకు సిద్దమయ్యాయి. ప్ర‌తిప‌క్ష‌ కాంగెస్‌ తో పాటు సీపీఐ నిరసన బాట పట్టనున్నాయి. కేంద్ర మంత్రులు స్పష్టంగా హోదా లేద‌ని తేల్చి చెబుతున్నా రాష్ట్ర కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రుల్లో మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారు.ఇక ఏపీలోని అధికార‌ టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారాన్ని త‌మ అధినేత చంద్రబాబే డీల్ చేస్తారని అంటున్నారు.

ఏపీ ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ప్ర‌క‌ట‌న‌ల నుంచి నిర‌స‌న బాట ఎంచుకున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టనుంది. హైదరాబాద్ గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయనుంది. అక్కడే పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. అటు వామపక్షాలు కేంద్రం ప్రకటనపై మండిపడుతున్నాయి. నీతి అయోగ్ నివేదక ఆధారంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడాన్ని విమర్శిస్తున్నాయి. ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ఇచ్చిన మాట కోసం కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.

ఏపీకి హోదా హుష్ కాకి అన్నట్టు కేంద్ర మంత్రులే పార్లమెంటు సాక్షిగా చెబుతున్నా రాష్ట్ర కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రుల్లో మాత్రం భ‌రోసా వ‌దులుకోవడం లేదు. విభజన చట్టంలోని హామీల్ని నెరవేర్చేందుకు కేంద్రం చిత్తశుద్దితో ఉందని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. కేవలం సాంకేతిక పరమైన సమస్యల వల్లే హోదాపై స్పష్టత రావడం లేదన్నారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నట్టుగానే ప్రత్యేక హోదా కూడా ఇస్తుందన్న భరోసాను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా...కేంద్రం ప్రకటనపై విపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నా టీడీపీ మంత్రులు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈవ్యవహారాన్ని చంద్రబాబు చూసుకుంటారని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీల్ని సాధిస్తామని మంత్రి రావెల కిషోర్ అన్నారు.