హమ్మ అలీబాబా.. నీలో ఇంత నియంత దాగి ఉన్నాడా?

Sat Apr 13 2019 19:45:42 GMT+0530 (IST)

రాజులు..రాజ్యాలు చూడలేదు కానీ.. దుర్మార్గుడైన రాజు రాజ్యంలో పరిస్థితులు ఎంత దుర్మార్గంగా ఉంటాయో  కథల్లోనూ.. సినిమాల్లోనూ చూసి ఉంటాం. ఒకవేళ గుర్తుకు రాకుంటే.. బాహుబలి సినిమాను గుర్తుకు తెచ్చుకుంటే చాలు.. బానిసల బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. సరిగ్గా ఆ తరహా రాక్షసత్వాన్ని గుర్తుకు వచ్చేలా వ్యాఖ్యలు చేశారు ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూపు ఛైర్మన్ జాక్ మా. అలీ బాబా మాట్లాడిన మాటలు విన్న వాళ్లకు ఒళ్లు మండిపోవటం ఖాయం.మనుషులన్న చిన్నపాటి కరుణ కూడా అలీబాబాకు ఏ కోశాన లేదన్న విషయం.. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఖాయంగా అర్థం కాక మానదు. అలీబాబా గ్రూపులో మీరు కొనసాగాలంటూ వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ పని చేయటం అవసరం అన్నారు. రోజుకు పన్నెండు గంటలు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎనిమిది గంటలు పని చేసే ఉద్యోగుల అవసరం కంపెనీకి లేదన్న అతగాడు.. అలాంటి వర్క్ కల్చర్ పోవాలంటూ తన అధికార వెబ్ అకౌంట్ లోనూ పోస్ట్ చేయటం గమనార్హం. అన్ని చోట్లా అందరూ 996 (నైన్ టు నైన్.. సిక్స్ డేస్) ఫాలో కావాలన్నారు. అలా పని చేయటం అదృష్టంగా భావించాలన్నారు.  చూస్తుంటే మనిషన్నోడు ఉదయం లేచి.. హడావుడిగా తినేసి.. పరుగులు పెడుతూ ఆఫీస్ కు వచ్చి.. మళ్లీ రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి.. కాసింత తిని పడుకుంటే సరిపోతుందన్నట్లుగా ఉంది.

సెల్ ఫోన్ ను ఉదయం నుంచి రాత్రి వరకూ వాడేసి.. పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టిన చందంగా మనుషుల్ని కూడా అలీబాబా భావిస్తున్నట్లుగా అనిపించక మానదు. అలీబాబా లాంటోళ్ల మాటల్ని తీవ్రంగా ఖండించటమే కాదు.. అయ్యగారికి సంబంధించిన వ్యాపారాలకు సంంధించి దేనిలోనూ మనిషి అన్నోడు కొనకుండా ఉండటం మంచిది. మనుషుల్ని యంత్రాలుగా చూసే అలీబాబా లాంటోళ్లు.. మానవాళికి ముప్పుగా మారతారనటంలో సందేహం లేదు.  

అందుకే.. మనిషన్నోడు అలీబాబాను సీరియస్ గా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. మనుషుల్ని యంత్రాలుగా చేసేందుకు ప్రపంచ వ్యాపారస్తులు.. పెట్టుబడిదారులు అలీబాబా లాంటోడి బాట పట్టటం ఖాయం.  ఇప్పటివరకూ కష్టపడి పైకొచ్చాడన్న ఫీలింగ్ ను తన తాజా వ్యాఖ్యతో అలీబాబా మీద ఉన్న గౌరవం మొత్తం మంటగలిసేలా వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అలీబాబా లోపలి నియంతను అందరికి చెప్పటం మర్చిపోవద్దు.  అలీబాబా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ.. ఆన్ లైన్లోనూ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి.. మీ సంగతేంటి?