రేపు జనసేనలో చేరనున్న ఆకుల

Sun Jan 20 2019 19:53:47 GMT+0530 (IST)

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయి. పనిలో పనిగా జంపింగ్ జపాంగ్‌లు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ కి వంగవీటి రాధా రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపారు.స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీమానా లేఖని స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు పంపినట్లు చెప్పారు ఆకుల సత్యనారాయణ. రేపు ఉదయం పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు. నిజానికి ఆకుల చేరిక ఎప్పుడో కన్ ఫర్మ్ అయింది. ఆయన భార్య ఇప్పటికే జనసేనలో కొనసాగుతున్నారు. ఆకుల రాకకు ఆమె ఎప్పుడో రంగం సిద్ధంచేసి పెట్టారు. రేపు లాంఛనప్రాయం కాబోతుంది.

గత ఎన్నికల్లో టీడీపీ అండతో బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు ఆకుల సత్యనారాయణ. ఈసారి అదే స్థానం నుంచి లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నారు. తన స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్యను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. రాజమండ్రిలో సామాజికంగా జనసేనకు మంచి పట్టు ఉంది. అది తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు ఆకుల.