Begin typing your search above and press return to search.

కొత్త పార్టీ పెట్టుకుంటానంటున్న కొడుకు

By:  Tupaki Desk   |   22 Oct 2016 7:28 AM GMT
కొత్త పార్టీ పెట్టుకుంటానంటున్న కొడుకు
X
ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అక్కడి రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పాలక సమాజ్ వాది పార్టీలో ఏ రోజు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. పార్టీ అంతా కుటుంబ సభ్యులే ఉండడంతో ఇంతకాలం అంతా జట్టుగా సాగినట్లుగా కనిపించినా ఇప్పుడు మాత్రం ఆ గుట్లన్నీ బయటపడి వేరు కుంపట్ల వరకు వెళ్తున్నాయి. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడిగా ములాయం సింగ్.. యూపీ సీఎంగా ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ లు పార్టీలో కీలక నేతలు కాగా ములాయం ఇద్దరు సోదరులు శివ్ పాల్ - రాంపాల్ లు కూడా కీలకమే. ఇంతకాలం ఇదంతా బలంలా కనిపించినా ఇప్పుడు అదే వికటించి దెబ్బకొడుతోంది. ఏకంగా తండ్రితో విభేదిస్తున్న అఖిలేశ్ కొత్త పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

కొద్దికాలంగా అఖిలేశ్ - ములాయం వర్గాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ములాయం సోదరుల్లో ఒకరు ములాయం వైపు - మరొకరు అఖిలేశ్ వైపు కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికే విభేదాలు ముదిరినా ఇటీవల అవి చల్లారినట్లు అనిపించాయి. కానీ... అంతలోనే ఇప్పుడు అఖిలేశ్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జోరందుకుంది.

ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని ములాయం ప్రకటించడం అఖిలేశ్ కు కోపం తెప్పించింది. బాబాయి శిప్ పాల్ ను సీఎం చేయడానికి తన తండ్రి ములాయం ప్రయత్నిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారు. దీంతో ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు అఖిలేశ్ సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జాతీయ సమాజ్‌ వాదీ పార్టీ.. ప్రగతిశీల్ సమాజ్‌ వాదీ పార్టీ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. కాగా ప్రస్తుత సమాజ్ వాది పార్టీది సైకిల్ గుర్తు కాగా అఖిలేశ్ కొత్త పార్టీ పెడితే మోటార్ సైకిల్ గుర్తు పొందాలనుకుంటున్నారట.

మరోవైపు అఖిలేష్ కుటుంబ నివాసం నుంచి విడిపోయి సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. వచ్చేనెల 5వ తేదీన పార్టీ రజతోత్సవ సంబరాలు నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుండగా, 3వ తేదీ నుంచి అఖిలేష్ 'వికాస్ రథయాత్ర" చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శుక్రవారం ఎస్పీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశానికి అఖిలేష్ గైర్హాజరయ్యారు. దీంతో పార్టీలో చీలిక తప్పదన్న ప్రచారం మరింత పెరుగుతోంది. నిజంగా అఖిలేశ్ కొత్త పార్టీ పెడితే నాన్న సైకిల్ స్పీడుగా వెళ్తుందో లేదంటే అఖిలేశ్ మోటార్ సైకిల్ దూసుకెళ్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/