Begin typing your search above and press return to search.

యూపీ అధికారపక్షంలో ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   24 Oct 2016 9:06 AM GMT
యూపీ అధికారపక్షంలో ఏం జరుగుతోంది?
X
ఓపక్క ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. విపక్షాలు తమ ప్రచారంతో దూసుకెళ్లేందుకు సమాయుత్తం అవుతున్న వేళ.. అధికారపక్షమైన సమాజ్ వాదీ పార్టీ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటల్లో బిజీబిజీగా ఉండటం గమనార్హం. అధికార సమాజ్ వాదీ పార్టీలో బాబాయ్.. అబ్బాయ్ ల మధ్య నడుస్తున్న అధిపత్యపోరుకు.. బాబాయ్ వెనుక పార్టీ చీఫ్ ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయ కలకలాన్ని రేపుతోంది. మంత్రివర్గం నుంచి బాబాయ్ ను బయటకు పంపిస్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ తీసుకున్న నిర్ణయం సమాజ్ వాదీ పార్టీలో పెను సంచలనంగా మారటమే కాదు.. పార్టీని చీలిక దిశగా ప్రయాణించేలా అఖిలేశ్ పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అఖిలేశ్ హాజరు కారన్న అంచనాలకు భిన్నంగా.. ఆయన కూడా హాజరు కావటం గమనార్హం. మరోవైపు.. బాబాయ్ వర్గం.. అబ్బాయి వర్గం మధ్య తోపులాటలు చోటు చేసుకొని పరిస్థితిని మరింత టెన్షన్ గా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాను పార్టీ చీలిక కోసం ప్రయత్నిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్ని అఖిలేశ్ తీవ్రంగా ఖండిచాంరు. అవసరమైతే తన సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సైతం తాను సిద్ధమని ప్రకటించారు.

ఈ మొత్తం లొల్లి.. అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలోకి రావటంతో మొదలైందని చెప్పొచ్చు. గత ఏడాది అమర్ సింగ్ మాట్లాడుతూ.. అఖిలేశ్ యూపీ ముఖ్యమంత్రి కాదని చేసిన వ్యాఖ్య తనను బాధించిందని చెప్పిన అఖిలేశ్.. తాను కొత్త పార్టీ పెడతానని ఎప్పుడూ అనలేదన్నారు. దీనికి భిన్నంగా శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త పార్టీ పెడుతున్నట్లుగా అఖిలేశ్ తనతో స్వయంగా చెప్పినట్లుగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అఖిలేశ్ స్పష్టం చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు.. తనకు.. తన తండ్రికి మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న వార్తలపై మీడియా వేసిన ప్రశ్నలకు భావోద్వేగానికి గురైన ఆయన.. ఒక దశలోకన్నీళ్లు పెట్టుకోవటం కనిపించింది. నేతాజీ కానీ కోరితే తన పదవికి రాజీనామా చేయటానికి తాను సిద్దమని ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/