అందరి చూపు అంబానీ పక్కనున్న ఆమెపైనే!

Sun Apr 15 2018 13:29:41 GMT+0530 (IST)

ఐపీఎల్ మ్యాచుల్లో క్రికెట్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అంతే ప్రాధాన్యత మిగిలిన అంశాల మీద ఉంటుందని చెబుతారు. క్రికెట్ లోని మరోకోణాన్ని ఐపీఎల్ పరిచయం చేస్తుందని చెబుతారు ఈ ఫార్మాట్ ను విమర్శించే వారంతా. ఏమైతేనేం.. మిగిలిన క్రికెట్ మ్యాచుల వేళల్లో పెద్దగా కనిపించని  వారు కాస్తా.. ఐపీఎల్ సందర్భంగా స్టేడియంలలో హడావుడి చేయటం కనిపిస్తుంది.ఐపీఎల్ మొదట్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు.. లావుపాటి భారీ కాయం స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించేవాడు. ఉత్సాహంగా.. అంతలోనే సీరియస్ గా.. మ్యాచ్ లో ఆటకు తగ్గట్లు మూడ్ ప్రదర్శించే అతగాడు.. ఐపీఎల్ పుణ్యమా అని తెగ ఫేమస్ అయిపోయాడు.

ఇదిలా ఉంటే.. తాజా ఐపీఎల్ లో అంబానీ పెద్ద కొడుకు సందడి చేస్తున్నాడు. తాజాగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తమ ఫ్రాంఛేజ్ జట్టు అయిన ముంబయికి ఢిల్లీకి మధ్య జరిగే మ్యాచ్ కు హాజరయ్యారు. వాస్తవానికి ఈ మ్యాచ్ కి ముకేశ్ అంబానీ కొడుకు ఆకాశ్ తో పాటు.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. అందరిలోకి స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రం ఆకాష్ అంబానీ పక్కనున్న వ్యక్తి నిలిచారు. ఇంతకీ ఆవ్యక్తి ఎవరంటారా? ఇంకెవరు.. ఈ మధ్యనే ఆకాశ్ అంబానీతో ఎంగేజ్ మెంట్ అయిన శ్లోక మెహతా.

కాబోయే భార్యతో కలిసి మ్యాచ్ చూసేందుకు వచ్చిన వీరిని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూశారు. ఇదే మ్యాచ్ కి ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితిక.. క్రికెట్ లెజెండ్ సచిన్ కుమారుడు అర్జున్ వచ్చినప్పటికీ.. అందరి కళ్లు మాత్రం ఆకాశ్ కాబోయే భార్య మీదనే ఉన్నాయి.

మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ కి.. ఈ మ్యాచ్ కి మధ్య భారీ తేడా ఒకటి ఉంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు దాదాపు 21 వేల మంది చిన్నారులు రావటం ఆసక్తికరంగా మారింది. స్టేడియంలో ఎటు చూసినా చిన్నారులతో కళకళలాడటమే కాదు.. వారి సందడితో కోలాహలంగా మారింది. నీలంరంగు జెర్సీ వేసుకొని ముంబయి ఇండియన్స్ జెండాలతో స్టేడియంలో సందడి చేసిన చిన్నారులు ఎంత పెద్ద సంఖ్యలో రావటానికి కారణం రిలయన్స్ ఫౌండేషన్ కారణంగా చెప్పాలి.

ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో ముంబయి మహానగరానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన 21 వేల మంది చిన్నారుల్ని స్టేడియంకు తీసుకొచ్చారు. మొత్తం 33 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో ఎటు చూసినా చిన్నారులే కనిపించటంతో ఈ ఐపీఎల్ మ్యాచ్ సరికొత్తగా కనిపించింది. ముంబయిలోని వేలాది మంది చిన్నారులకు ఐపీఎల్ ఆటను నేరుగా చూసేందుకు అవకాశం కల్పించటంపై ముంబయి ఆటగాళ్లు ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. తమ ఫ్రాంచైజ్ ను మార్కెటింగ్ చేసుకోవటంలో రిలయన్స్ తర్వాతే ఎవరైనా. కాదంటారా?