Begin typing your search above and press return to search.

అహ్మ‌ద్ ప‌టేల్ గెలుపు..మోడీ ఓడిన‌ట్లే!

By:  Tupaki Desk   |   9 Aug 2017 5:08 AM GMT
అహ్మ‌ద్ ప‌టేల్ గెలుపు..మోడీ ఓడిన‌ట్లే!
X
పెద్ద‌గా ప‌ట్ట‌ని రాజ్య‌స‌భ ఎన్నిక‌లకు భిన్నం.. తాజాగా జ‌రిగిన‌ గుజ‌రాత్ రాష్ట్ర రాజ్య‌స‌భ ఎన్నిక‌లు. దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌. త‌మ వ్యూహాల‌తో కాంగ్రెస్ కు క‌రెంటు షాక్ ఇవ్వాల‌ని.. సోనియ‌మ్మ‌కు దిమ్మ తిరిగేలా చేయాల‌ని ప్లాన్ చేసిన ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల ఆట‌లు సాగ‌లేదు. త‌మ‌కు చెంద‌ని స్థానం కోసం వారిద్ద‌రూ చేసిన ప్ర‌య‌త్నం మ‌హా క‌క్కుర్తిగా మారి మోడీ స‌ర్కారు ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. పోలింగ్ సంద‌ర్భంగా చోటు చేసుకున్న వైనం.. అనంత‌రం బీజేపీ నేత‌లు ప్ర‌వ‌ర్తించిన తీరుకు భ‌విష్య‌త్తులో స‌మాధానం చెప్పుకోక త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా తుది ఫ‌లితం రావ‌టం విశేషం.

కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్న తర్వాత కూడా వారికి ద‌క్కాల్సిన రాజ్య‌స‌భ సీటును ద‌క్క‌కుండా చేసేందుకు చివ‌రి వ‌ర‌కూ మోడీ.. షాలు చేసిన ప్ర‌య‌త్నాలు వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెప్పాలి. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల వైకుంఠ‌పాళి ఆట‌లో ఎట్ట‌కేల‌కు అహ్మ‌ద్ ప‌టేల్ విజ‌యం సాధించారు.

తుదివ‌ర‌కూ తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన ఈ ఎన్నిక‌ల్లో అహ్మ‌ద్ ప‌టేల్ మేజిక్ ఫిగ‌ర్‌ కు అవ‌స‌ర‌మైన ఓట్ల‌ను సొంతం చేసుకోవ‌టంతో ఈ భారీ పోరులో అంతిమ విజ‌యం కాంగ్రెస్ పార్టీకి ద‌ఖ‌లు ప‌డ‌గా.. మోడీ అండ్ కోకు భారీ డ్యామేజ్ మిగిలింది. చివ‌ర‌కు రెండు రాజ్య‌స‌భ సీట్లు సొంతం చేసుకున్న ఆనందం కూడా మిగ‌ల‌ని ప‌రిస్థితి. ఎదుటోళ్ల ఆనందాన్ని దెబ్బ తీయాల‌ని భావించే వారికి.. త‌మ‌కున్న సంతోషం కోసం పోతుంద‌న్న విష‌యం తాజా ఎపిసోడ్ లో మ‌రోసారి రుజువైంద‌ని చెప్పాలి.

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 121 సీట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మూడు రాజ్య‌స‌భ సీట్ల కోసం గుజ‌రాత్ లో ఎన్నిక‌లు నిర్వ‌హించారు. బీజేపీకి ఉన్న బ‌లం ప్ర‌కారం రెండు సీట్లు ప‌క్కాగా విజ‌యం సాధించే ప‌రిస్థితి. ఒక్కో సీటును సొంతం చేసుకోవ‌టానికి 45 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ లెక్క‌న రెండు స్థానాల‌కు క‌లిపి 90 మంది ఎమ్మెల్యేలు స‌రిపోతారు. ఇక‌.. మిగిలింది 31 ఓట్లు. కానీ.. గెలుపున‌కు అవ‌స‌ర‌మైంది 45 మంది ఎమ్మెల్యేలు. దీంతో.. విప‌క్ష కాంగ్రెస్ ను దెబ్బ తీసి త‌మకు అవ‌స‌ర‌మైన 14 మంది ఎమ్మెల్యేల కోసం బీజేపీ అధినాయ‌క‌త్వం చాలానే ప్ర‌య‌త్నాలు చేసింది.

ఇదిలా ఉండ‌గా.. బీజేపీ త‌ర‌పున అమిత్ షా.. స్మృతి ఇరానీల‌తో పాటు.. మూడో అభ్య‌ర్థిగా ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన బ‌ల్వంత్ సింగ్ రాజ్ పుత్‌ ను బ‌రిలో నిలిపారు. త‌మ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన ఒక్క స్థానాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ అహ్మ‌ద్ ప‌టేల్ (సోనియాగాంధీకి రాజ‌కీయ స‌ల‌హాదారు) ను బ‌రిలోకి దించింది. దీంతో.. అహ్మ‌ద్‌ ను ఎలాగైనా ఓడించాల‌ని మోడీ.. అమిత్ షాలు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. గుజ‌రాత్‌ కాంగ్రెస్ పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను చేప‌ట్టారు. ఇలా చాలానే చేసినా.. ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ వేళ జ‌రిగిన ఒక పొర‌పాటుతో మోడీ.. షా ప్లాన్ వ‌ర్క్ వుట్ కాలేదు.

క్రాస్ ఓటింగ్‌ను న‌మ్ముకున్న మోడీ.. అమిత్ షాల‌కు త‌గ్గ‌ట్లే ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు త‌మ ఓట్ల‌ను బీజేపీ అభ్య‌ర్థికి వేసిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌క‌టించారు. అంతేనా.. తాము బీజేపీకి వేసే ఓట్ల‌ను ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు(రాఘ‌వ్ జీ.. భోలా గోహిల్‌) బీజేపీ పోలింగ్ ఏజెంట్ల‌కు చూపించి వేశారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్ద‌రు త‌మ బ్యాలెట్ పేప‌ర్ల‌ను అమిత్ షాకు చూపించి వేశారంటూ కాంగ్రెస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. వారి ఓట్ల‌ను చెల్ల‌నివిగా ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ నేత‌లు చిదంబ‌రం.. ర‌ణ్ దీప్ సూర్జేవాలా.. ఆర్పీఎన్ సింగ్ లు ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ పెద్ద‌లు కూడా రంగంలోకి దిగారు.

కేంద్ర‌మంత్రులు అరుణ్ జైట్లీ.. నిర్మ‌లా సీతార‌మ‌న్ తో పాటు ఇత‌ర నేత‌లు సైతం హుటాహుటిన ఎన్నిక‌ల క‌మిష‌న్ కార్యాల‌యానికి వెళ్లారు. ఇరువురు నేత‌లూ పోటాపోటీగా ఈసీని ఆశ్ర‌యించ‌టంతో లెక్కింపు ప్ర‌క్రియ ఆల‌స్య‌మైంది. ఇరు పార్టీల వాదోపవాదాల న‌డుమ‌.. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ఇష్యూ మీద హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ నేప‌థ్యంలో రాత్రి ప‌ద‌కొండున్న‌ర గంట‌ల వేళ‌లో ఎన్నిక‌ల సంఘం అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది. పోలింగ్ ప్రక్రియ వీడియోను ప‌రిశీలించింది. ఇందులో బీజేపీ ఏజెంట్ కు బ్యాలెట్ చూపిన ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్ల‌వ‌ని పేర్కొంది. ఇది ఓపెన్ బ్యాలెట్ అయిన‌ప్ప‌టికీ పార్టీ నియ‌మించిన అధీకృత ఏజెంటుకు త‌ప్ప ఇత‌రుల‌కు తాము వేసే ఓట్ల‌ను చూపించ‌కూడ‌ద‌ని.. అలా చూపించ‌టం ద్వారా వారు రూల్స్ ను ఉల్లంఘించార‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఓట్ల లెక్కింపు ప్ర‌కియ ప్రారంభ‌మైంది. ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్ల‌నివిగా ఎన్నిక‌ల సంఘం తేల్చ‌టంతో గెలుపు లెక్క‌లు మారాయి. గెలుపున‌కు 44 ఓట్లు వేస్తే స‌రిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అహ్మ‌ద్ ప‌టేల్‌కు జేడీయూ.. ఎన్సీపీల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఓట్లు వేయ‌టంతో ఆయ‌న‌కు అవ‌స‌ర‌మైన మేజిక్ ఓట్లు అహ్మ‌ద్‌కు ప‌డ్డాయి. దీంతో.. అహ్మ‌ద్ గెలుపు ఖాయ‌మైంది. చివ‌రి వ‌ర‌కూ అహ్మ‌ద్ ప‌టేల్ ను ఓడించాల‌ని ప్ర‌య‌త్నించిన మోడీ అండ్ కోకు ఓట‌మి త‌ప్ప‌లేదు.