Begin typing your search above and press return to search.

బుడ్డోడు గ‌ట్టోడే:100కోట్ల ప‌రువున‌ష్ట‌మంట‌!

By:  Tupaki Desk   |   24 Nov 2015 5:21 AM GMT
బుడ్డోడు గ‌ట్టోడే:100కోట్ల ప‌రువున‌ష్ట‌మంట‌!
X
కొద్దిరోజుల క్రితం అమెరికాలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న ఆ దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌కలం రేప‌టంతో పాటు..పెద్ద వార్తాంశంగా మారింది. అమెరికాలోని టెక్సాస్ లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ముస్లిం కుర్రాడు అహ్మ‌ద్ మ‌హ్మ‌ద్ త‌న సొంత తెలివితేట‌ల‌తో ఒక డిజిట‌ల్ అలారం క్లాక్ త‌యారు చేశాడు. దాన్ని స్కూల్‌ కు తీసుకెళ్లాడు. అయితే.. అక్క‌డి టీచ‌ర్లు అత‌ను బాంబు తెచ్చాడ‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేయ‌టం.. వారు ఆ పిల్లాడ్ని అరెస్ట్ చేయటం జ‌రిగిపోయాయి. ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున రావ‌టంతో అహ్మ‌ద్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయ్యాడు.

పిల్లాడికి మ‌ద్దుతుగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌టం.. చివ‌ర‌కు అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా సైతం స్పందించి.. వైట్‌ హౌస్ కు పిలిపించ‌టం లాంటివి చేశారు. ఇక‌.. ఫేస్ బుక్ అధినేత జుక‌ర్ బ‌ర్గ్ సైతం.. పిల్లాడి తెలివితేట‌ల‌కు అబ్బుర‌ప‌డి స్వ‌యంగా ఆహ్వానించ‌టం లాంటివి ఎన్నో జ‌రిగిపోయాయి.

ఈ నేప‌థ్యంలో ఖ‌తార్ లోని ఓ ముస్లిం ఫౌండేష‌న్ స‌ద‌రు విద్యార్థిని చ‌దివించేందుకు ముందుకు రావ‌టంతో ఆ దేశానికి వెళ్ల‌నున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ పిల్లాడు త‌న లాయ‌ర్ ద్వారా ఒక నోటీసులు పంపాడు. త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకొని అవ‌మానించినందుకు ప‌రిహారంగా ఇర్వింగ్ సిటీ పోలీసులు.. మేయ‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. 15 మిలియ‌న్ల న‌ష్ట‌ప‌రిహారాన్ని (అరెస్ట్ చేసి అవ‌మానించినందుకు 10 మిలియ‌న్ డాల‌ర్లు.. ముస్లిం విద్యార్థి అన్న వివ‌క్ష చూపినందుకు 5 మిలియ‌న్ డాల‌ర్లు) చెల్లించాల‌ని కోరాడు. 15 మిలియ‌న్ డాల‌ర్లు అంటే మ‌న రూపాయిల్లో రూ.100కోట్లుగా చెప్పొచ్చు. త‌న‌ను అవ‌మానించిన వారు భారీ న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌న్న నోటీసుల మీద సంబంధిత వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. చూస్తుంటే.. పిల్లాడు కాస్త ఘ‌టికుడిగానే క‌నిపిస్తున్నాడే.