Begin typing your search above and press return to search.

రాహుల్ విమ‌ర్శ‌ల‌పై ఆర్ ఎస్ ఎస్ కౌంట‌ర్ ఇదే

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:24 AM GMT
రాహుల్ విమ‌ర్శ‌ల‌పై ఆర్ ఎస్ ఎస్ కౌంట‌ర్ ఇదే
X

రాజ‌కీయ ప‌రంగాను - ఇటు సిద్ధాంత ప‌రంగాను ఉప్పు నిప్పులా ఉండే కాంగ్రెస్ - ఆర్ ఎస్ ఎస్‌ ల మ‌ధ్య మాట‌ల పోరు - హోరు రోజు రోజుకు పెరుగుతోంది. రెండు రోజుల కింద‌ట గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాహుల్‌.. ఆర్ ఎస్ ఎస్‌ పై నిప్పులు చెరిగారు. మ‌హిళ‌లంటే గౌర‌వం లేద‌ని - మ‌హిళ‌ల‌కు విలువ ఇవ్వ‌ర‌ని విచ్చ‌ల‌విడి కామెంట్లు చేశారు. దీనిని అప్ప‌ట్లో లైట్ గా తీసుకున్న ఆర్ ఎస్ ఎస్‌.. తాజాగా మాత్రం రాహుల్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. రాహుల్ సోద‌రి ప్రియాంక సెంట్రిక్‌ గా రెచ్చిపోయింది. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన రాకేష్ సిన్హా రాహుల్ వ్యాఖ్య‌ల‌కు తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు.

రాహుల్ సోద‌రి ప్రియాంక గాంధీని ఆర్ ఎస్ ఎస్ శాఖకు రావాలని ఆహ్వానించారు. ఆ విధంగా వస్తే మహిళలకు తమ శాఖల్లో ఎలాంటి గౌరవం ఇస్తున్నామో నేరుగా ఆమె తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. రాహల్ చేసిన 'షార్ట్' వ్యాఖ్యలు మహిళలను కించపరచేలా ఉన్నాయ‌ని రాకేష్ సిన్హా అన్నారు. 'ఆర్ ఎస్ ఎస్ గురించి ఆయనకు ఏం తెలుసు? ఆర్ ఎస్ ఎస్ శాఖకు ప్రియాంకను నేను ఆహ్వానిస్తున్నాను. మహిళలకు ఆర్ ఎస్ ఎస్ గౌరవం ఎలా గౌర‌వం ఇస్తుందో, ఎంత హుందాగా ప్రవర్తిస్తుందో ఆమె స్వయంగా తెలుసుకోవచ్చు' అని తెలిపారు. 90 ఏళ్లుగా నడుస్తున్న సంస్థ విలువలపై కనీస అవగాహన లేకుండా రాహుల్ మాట్లాడటం తగదని సిన్హా హితవు పలికారు.

వాస్త‌వానికి ఇలా కౌంట‌ర్ వ‌స్తుంద‌ని రాహుల్ ఊహించి ఉండ‌రు. గ‌తంలోనూ ఆయ‌న ఆర్ ఎస్ ఎస్‌ పై కామెంట్లు కుమ్మ‌రించారు. దేశ పాల‌న అంతా ఆర్ ఎస్ ఎస్ చేస్తోంద‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఒట్టి తోలు బొమ్మ అని ఆయ‌న బిహార్‌ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో పేర్కొన్నారు. త‌ద్వారా ముస్లింల‌ను ఆక‌ట్టుకునే ప‌ని చేశారు. అయితే, అప్ప‌ట్లో ఆర్ ఎస్ ఎస్ ఈ వ్యాఖ్యల‌పై స్పందించ‌లేదు. అయితే, గుజ‌రాత్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాహుల్ మ‌రోసారి ఆర్ ఎస్ ఎస్‌ ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌హిళా సెంటిమెంట్‌ ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్రయ‌త్నించారు. అయితే, అది ఇప్పుడు బెడిసి కొట్టింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. రేపో మాపో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రియాంక గాంధీనే ఆర్ ఎస్ ఎస్ టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మ‌రి దీనికి రాహుల్ అండ్ టీం ఎలా రియాక్ల్ అవుతుందో చూడాలి.