టీ20 రికార్డులను షేక్ చేసిన ఆఫ్ఘనిస్తాన్

Sat Feb 23 2019 22:38:56 GMT+0530 (IST)

ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ ప్రపంచంలో అదో బుడత. కానీ మహామహా జట్లను మించిపోయే రికార్డును తనపరం చేసుకుంది. టెస్టులు వన్డేలను దాటి ఇప్పుడు టీ20లు క్రికెట్ అభిమానులనుఉర్రూతలూగిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో ఇండియా ఆస్ట్రేలియా సహా పలు జట్లు మంచి ప్రతిభ చూపుతున్నా తాజాగా ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన రికార్డుతో అదరగొట్టింది. ఆస్ట్రేలియా పేరటి ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తాను సొంతం చేసుకుంది.
    
టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసి అఫ్ఘానిస్థాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐర్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో ఆ జట్టు నిర్ణీత 20 ఒవర్లలో 278 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జాజి సెంచరీతో రాణించాడు. 62 బంతుల్లో 162 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు. జాజి స్కోర్ లో అత్యధికంగా సిక్స్‌ల నుంచే వచ్చాయి. 16 సిక్స్‌లు 11 ఫోర్లతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. అతనికి తోడుగా వచ్చిన ఉస్మాన్ ఘణి కూడా 73 పరుగులతో రాణించాడు.వీరిద్దరి భాగస్వామ్యంతో అఫ్ఘాన్ జట్టు 278 పరుగులు సాధించింది. ఇదే క్రమంలో ఈ జంట టీ20లో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
    
2016లో ఆస్ట్రేలియా 263 పరుగులు సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్ గా ఉండేది. ఈ రికార్డ్ ను ఐర్లండ్ మ్యాచ్ లో అఫ్ఘాన్ బ్రేక్ చేసింది. గతంలో అత్యధిక భాగస్వామ్యం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు అరోన్ ఫించ్ డార్సీ( 223 పరుగులు) పేరటి ఉండేది. ఈ రికార్డునూ హజ్రతుల్లా ఉస్మాన్ జంట బద్దలుగొట్టింది.