Begin typing your search above and press return to search.

ఆర్కిటిక్ లో హిట్లర్ సీక్రెట్ డెన్..?

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:12 AM GMT
ఆర్కిటిక్ లో హిట్లర్ సీక్రెట్ డెన్..?
X
యుద్ధకాంక్షతో ప్రపంచాన్ని వణికించిన నియంత అడాల్ఫ్ హిట్లర్. పాశవిక ధోరణితో వ్యవహరించే ఈ నియంతకున్న సామ్రాజ్య విస్తరణ కాంక్ష కొన్ని కోట్లమంది ప్రాణాలు తీసేలా చేసిన విషయం తెలిసిందే. జర్మనీ నియంత అయిన హిట్లర్ వేసిన మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ఒక సంచలన విషయం తాజాగా బయటకు వచ్చింది. అగ్రరాజ్యమైన రష్యాపై అధిపత్యం సాధించేందుకు.. ఆ దేశంపై దండెత్తటానికి ఏడాదికి ముందే.. మనుష్య సంచారం లేని అర్కిటిక్ లో రహస్య స్థావరాన్నిఏర్పాటు చేసిన వైనాన్ని తాజాగా గుర్తించారు.

ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఆర్కిటిక్ ప్రాంతంలో మనుష్య సంచారం లేని విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు హిట్లర్ సీక్రెట్ డెన్ ను గుర్తించారు. 1942లో హిట్లర్ ఆదేశాలతో ఈ రహస్య స్థావరాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. 1943 నుంచి ఈ డెన్ తన కార్యకలాపాలు మొదలెట్టిందని.. అయితే.. 1944లో ఈ డెన్ కు అవసరమైన ఆహార పదార్థాలు సరఫరా చేయలేకపోవటంతో.. ఒక చనిపోయిన ఎలుగబంటిని తినటం ద్వారా ఈ డెన్ లోని సైనికులంతా మరణించి ఉన్నట్లుగా భావిస్తున్నారు. చనిపోయిన ఎలుగుబంటి మాంసం విషపూరితం కావటంతో ఈ డెన్ లోని వారంతా చనిపోవటం.. వారి ఆనవాళ్లు బయట ప్రపంచానికి ఇంతకాలం తెలీకుండా పోయాయి. తాజాగా.. ఈ డెన్ కు సంబంధించిన విశేషాలకు బయటకు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తర ధ్రువానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈ సీక్రెట్ డెన్ ను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని అలెగ్జాండ్రా ల్యాండ్ వద్ద ట్రెజర్ హంటర్ పేరుతో వ్యవహరించిన రహస్య ప్రాంతం ఇదేనని అంచనా వేస్తున్నారు. ఇక్కడ స్వస్తిక్ గుర్తుతో ఉన్న జెండాలు.. పేపర్ డాక్యుమెంట్స్.. బంకర్ల శిధిలాలతోపాటు.. వాడేసిన పెట్రోల్ క్యాన్లు.. బుల్లెట్లు.. చిరిగిపోయిన‌ గుడారాలు లాంటి పలు వస్తువుల్ని గుర్తించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/