Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన ఆదివాసీల స‌భ‌

By:  Tupaki Desk   |   10 Dec 2017 4:30 AM GMT
హాట్ టాపిక్ గా మారిన ఆదివాసీల స‌భ‌
X
పెద్ద‌గా ప్ర‌చారం జ‌ర‌గ‌ని.. మీడియాలో పెద్ద‌గా నాన‌ని ఆదివాసీల ఆత్మ‌గౌర‌వ బ‌హిరంగ స‌భ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేనా.. తెలంగాణ స‌మాజం విస్తుపోయేలా జ‌రిగిన ఈ స‌భపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. మీడియా ఆఫీసుల‌కు నిత్యం ప‌లు పోరాట స‌మితుల పోరాటాల గురించి.. హ‌క్కుల స‌ద‌స్సుల గురించి ప్రెస్ నోట్లు వ‌స్తుంటాయి. న‌లుగురైదుగురు క‌లిసి ప్రెస్ మీట్లు పెట్ట‌టం.. త‌మ పోరాటం గురించి వారు వివ‌రిస్తుంటారు. వారి వార్త‌ల్ని జిల్లా పేజీల్లో ఫోటోలు కూడా వేయ‌కుంగా నాలుగు ముక్కుల‌తో లాగిస్తుంటారు.

అలాంటిది శ‌నివారం హైద‌రాబాద్ శివారులోని స‌రూర్ న‌గ‌ర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీల ఆత్మ‌గౌర‌వ బ‌హిరంగ స‌భ భారీగా జ‌ర‌గ‌ట‌మే కాదు.. ఈ స‌భ కోసం త‌ర‌లివ‌చ్చిన ఆదివాసీల సంఖ్య క‌ళ్లు చెదిరేలా ఉంది. ఇదే గ్రౌండ్ లో తెలంగాణ రాజ‌కీయ జేఏసీ కోదండ‌రాం నేతృత్వంలో కొలువ‌ల‌కై కోట్లాట స‌భ కూడా ఇక్క‌డే జ‌రిగింది. అయితే.. ఈ స‌భ‌కు ప‌ది వేల కంటే త‌క్కువ మంది హాజ‌రైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

కోదండ‌రాం మాష్టారి కొలువుల‌కై కోట్లాట స‌భ‌కు హాజ‌రైన వారితో పోలిస్తే.. తాజాగా నిర్వ‌హించిన ఆదివాసీల స‌భ అద‌ర‌గొట్టేసింది. సుమారు 1.25 ల‌క్ష‌ల మంది ఈ స‌భ‌కు హాజరైన‌ట్లు చెబుతున్నారు. మ‌రో అంచ‌నా ప్ర‌కారం అయితే..ల‌క్ష మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. బ‌హిరంగ స‌భ‌కు ల‌క్ష మంది వ‌చ్చిందైతే ఖాయ‌మ‌ని చెప్పాలి.

శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుంచే మొద‌లైన హ‌డావుడి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నాటికి దాదాపు 60.. 70 వేల మంది హాజ‌రు కావ‌టంతో మీడియా వ‌ర్గాలు సైతం విస్మ‌యానికి గుర‌య్యారు. ఆదివాసీల హ‌క్కుల బ‌హిరంగ స‌భ అంటే.. ప‌దివేల మంది వ‌స్తేనే గొప్ప అనుకున్నారు. దీనికి అతీతంగా వేలాదిగారావ‌టమే కాదు.. దాదాపు ల‌క్ష మంది వ‌ర‌కూ వ‌చ్చిన ఈ కార్య‌క్ర‌మం మీడియా వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కీ ఈ స‌భ‌లో ఏం మాట్లాడారు? ఆదివాసీల‌ను ఈ స‌భ ఇంత‌గా క‌దిలించింది అన్న విష‌యాల్లోకి వెళితే.. విద్య‌.. ఉద్యోగం.. ఉపాధి.. భూముల విష‌యాల్లో ఆదివాసీల‌కు రాజ్యాంగం క‌ల్పించిన రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కావ‌టం లేద‌న్న వాద‌న‌ను వినిపించారు. తెలంగాణ‌లో పుట్టిన కుమురం భీం.. రాంజీగోండ్ లాంటి ఆదివాసీ ఉద్య‌మ‌కారుల‌కు చెందిన వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు.

తెలంగాణ‌లో ఆదివాసీల‌కు లంబాడీల‌తో ముప్పు ఉంద‌ని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు..మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావు ఆరోపించారు. లంబాడీల‌ను ఎస్టీ జాబితాల నుంచి తొల‌గించాలంటూ మొద‌లైన ఉద్య‌మాన్ని దాన్ని నెర‌వేర్చేవ‌ర‌కూ నిలిపివేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. త‌మ డిమాండ్ల ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వం దిగి రావాల‌ని.. ఇందుకోసం ఈ నెల 15 వ‌ర‌కు గుడువు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆదివాసీల హ‌క్కుల సాధ‌న కోసం ఆదివాసీల ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఉద్య‌మంలో పాల్గొనాలంటూ అల్టిమేటం విధించారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ల‌క్ష మందితో ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్నారు. లంబాడీల నుంచి తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై పాట‌లు పాడారు. లంబాడీల‌ను ఎస్టీ జాబితా నుంచి తొల‌గించే వ‌ర‌కూ త‌మ ఉద్య‌మాన్ని నిలిపివేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈస‌భ‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయ‌కులే కాదు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజ‌రయ్యారు. ఏముందిలే ఆదివాసీల ఆత్మ‌గౌర‌వ స‌ద‌స్సు అనుకున్న నిఘా వ‌ర్గాల‌కు సైతం షాకిచ్చే స్థాయిలో హాజ‌రు కావ‌టం.. కేసీఆర్ స‌ర్కారు సైతం ఊహించ‌లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ తీరును నిర‌సించేలా ఇంత పెద్ద కార్య‌క్ర‌మాన్ని ఇంత స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించ‌టం చిన్న విష‌యం కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మం ఏదైనా స‌రే.. దాన్ని జ‌ర‌గ‌కుండా అన్న‌ట్లుగా సాగే వైనానికి భిన్నంగా.. ఈ స‌భ స‌క్సెస్ ఫుల్ గా ముగియ‌టం నిఘా వ‌ర్గాల‌కు షాక్ గా మారితే.. ఆదివాసీ వ‌ర్గాలు మాత్రం ఫుల్ ఖుషీతో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.