Begin typing your search above and press return to search.

ఆదిరెడ్డి కండువా మారుతోంది

By:  Tupaki Desk   |   20 July 2016 7:29 AM GMT
ఆదిరెడ్డి కండువా మారుతోంది
X
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. అయితే.. అదంతా గాలి మాటలే అంటూ వైసీపీ అభిమానులు కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ.. ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ కీలక నేతలతో ఉన్న బంధుత్వాలు, వారిమధ్య ఇటీవల జరిగిన భేటీల గురించి తెలిసినవారు మాత్రం ఆదిరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమంటూ తేదీలతో సహా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదిరెడ్డి టీడీపీలో చేరుతారన్నది నిజమా.. చేరరన్నది నిజమా అన్న సందిగ్థానికి ఆయనే తెరదించేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.

కాగా వైసీసీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అందరు నేతల్లానే ఆదిరెడ్డి కూడా కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. వైసీపీ బలంతో గెలుచుకున్న ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఈ నెల 22న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. కాగా ఇప్పటికే ఆయన రాజమండ్రిని చంద్రబాబు ప్లెక్సీలతో నింపేశారు. ఆదిరెడ్డి ఇంటి ఏరియాతో పాటు సిటీలోని ప్రధాన ప్రాంతాలన్నీ ఆదిరెడ్డి, చంద్రబాబులున్న ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలతో నిండిపోయాయి.

నిజానికి ఆదిరెడ్డి అప్పారావు చాలాకాలంగా తన పాతగూడు టీడీపీలో రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. స్థానిక టీడీపీ నేత గన్ని కృష్ణ - సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అడ్డంపడుతూ వచ్చారు.

అప్పారావు టీడీపీలో ఉండగానే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో విబేధాలు తీవ్రస్థాయిలో ఉండేవి. ఫిటింగ్ మాస్టర్ గా పేరున్న బుచ్చయ్య చౌదరి పోరు పడలేకే ఆదిరెడ్డి వైసీపీలోకి వచ్చేశారు. దీంతో పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్‌. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి పాత పార్టీలోకి జంప్‌ చేయాలని ఆదిరెడ్డి అప్పారావు భావించారు. కానీ గోరంట్ల అడ్డుపడుతూ వచ్చారు. అయినా అప్పారావు ప్రయత్నాలు కొనసాగించారు. టీడీపీలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడుతో ఉన్న బంధుత్వం సహాయంతో చంద్రబాబు వద్ద ఆమోదం పొంది ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వస్తున్నారు.

అచ్చెన్నాయుడు సోదరుడు, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడుకు ఆదిరెడ్డి అప్పారావు వియ్యంకుడు. అప్పారావు కుమారుడికి ఎర్రన్నాయుడు కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. దీంతో అచ్చెన్నాయుడుతోనూ ఆదిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిగా ఉండగా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహననాయుడు ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు వద్ద ఆయనకు కూడా మంచి పట్టుంది. దీంతో చాలాకాలంగా పెండింగులో ఉన్న తన టీడీపీ ప్రవేశాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆదిరెడ్డి తెలివైన ఎత్తుగడ వేశారని చెబుతున్నారు. ఆయన కోడలు తన అన్న రామ్మోహననాయుడు - బాబాయి అచ్చెన్నాయుడుల వద్ద లాబీయింగ్ చేయడంతో వారు చంద్రబాబును ఒప్పించారని.. దాంతో బుచ్చయ్య చౌదరి అభ్యంతరాలను పక్కనపెట్టి చంద్రబాబు ఆదిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. దీంతో మరో రెండు రోజుల్లో ఆదిరెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారు.