సాయిరెడ్డి ఆరోపణ నిజమే!..ఆది వ్యాఖ్యలే నిదర్శనం!

Fri Feb 23 2018 12:48:21 GMT+0530 (IST)

ఏపీలో కొనసాగుతున్న టీడీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఎలా వాడుతుందన్న విషయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభలో ఆ పార్టీ ఏకైన సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా తనదైన వాదనను వినిపిస్తున్నారు. టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్ద పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సతీశ్ చంద్ర - సాయి ప్రసాద్ లతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావులు... విపక్షాన్ని బలహీనం చేయడంలో టీడీపీ సర్కారుకు తమదైన రీతిలో సాయం చేస్తున్నారని సాయిరెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన వద్ద పక్కా ఆధారాలున్నాయని - వైసీపీ టికెట్లపై విజయం సాధించిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు అధికారులు తమవంతుగా సాయం చేస్తున్నారని - ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలను వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని కూడా సాయిరెడ్డి ఆరోపించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ తనదైన శైలి ఎదురు దాడిని ప్రారంభించిందనే చెప్పాలి. అయితే టీడీపీ నేతలు - మంత్రులు చేస్తున్న వాదనలో ఏమాత్రం పస లేదని సాక్షాత్తు చంద్రబాబు సర్కారులో కీలక శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా తనదైన వ్యాఖ్యలతో చంద్రబాబును - మంత్రులను... మొత్తంగా టీడీపీ వాదనను ఆదినారాయణ రెడ్డి తప్పని చెప్పేసినట్లుగా భావించక తప్పదేమో.అయినా ఈ దిశగా ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే... గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పైనే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆది... ఆ తర్వాత టీడీపీలో చేరారు. తదనంతరం చంద్రబాబు ఆయనను తన కేబినెట్ లో చేర్చుకోవడంతో పాటుగా మార్కెటింగ్ శాఖను అప్పగించారు. ఆది టీడీపీలో చేరుతున్న విషయాన్ని జమ్మలమడుగు టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జీగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినా... చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పి మరీ ఆదిని టీడీపీలో చేర్చుకున్నారు. ఆదికి మంత్రి పదవిని ఇచ్చిన బాబు... రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మధ్యేమార్గంగా రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఏ పని అయినా ఇద్దరు చెరి సగం పంచుకోవాలని చంద్రబాబు వారిద్దరికీ సూచించారట. ఇదేదో వారిద్దరిని కూర్చోబెట్టి మాత్రమే చంద్రబాబు రాజీ చేయలేదట. ఇద్దరు ఐఏఎస్ అధికారుల సమక్షంలో చంద్రబాబు ఈ పంచాయతీ చేశారట. ఈ మాటను ఆదినారాయణరెడ్డే స్వయంగా వెల్లడించారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో భాగంగా ఆదినారాయణ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నిజంగానే వైరల్ గా మారిపోయింది.

ఆ వీడియోలో ఆదినారాయణ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే..  *రామసుబ్బారెడ్డి గారికి కూడా ప్రతి రూపాయిలో అర్ధ రూపాయి భాగం ఉంది ఈడ. అర్థ రూపాయి భాగం ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను మాతోపాటు కూర్చోబెట్టి పంచాయతీ చేశారు.ఆయన అడిగిన దాంట్లో మనకు సగం వస్తాది. మనం అడిగిన దాంట్లో ఆయనకు సగం వస్తాది. వాళ్లు నన్ను ఏమి విమర్శించినా నేను అయితే పట్టించుకోను* అని ఆయన చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు తన వద్ద పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అన్న విషయాన్న ఆదినారాయణ రెడ్డి చెప్పడంతో పాటు... ఇదే విషయంపై సాయిరెడ్డి చేస్తున్న వాదనను నిజమేనని ఒప్పేసుకున్నట్లుగా ఉందన్న వాదన వినిపిస్తోంది.