టీడీపీ అడిగిందివ్వలేదు!...వైసీపీలోకి ఆదాల?

Tue Feb 19 2019 09:49:42 GMT+0530 (IST)

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఈ రెండు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలనే మార్చేసేలా ఉంటున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ రెండు జిల్లాల్లో విపక్ష వైసీపీకి మంచి పట్టుంది. గడచిన ఎన్నికల్లో కంటే కూడా ఈ దఫా ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వీలయినన్ని స్థానాల్లో గెలుపొందడం ద్వారా అధికార పగ్గాలు దక్కించుకునే అవకాశాలను మెరుగుపరచుకోవాలన్న దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఈ జిల్లాలో గెలుపు అవకాశాలున్న నేతలను తమ దరికి చేర్చుకునేందుకు జగన్ తనదైన మంత్రాంగాన్ని అమలు చేస్తున్నారు.ఇప్పటికే నెల్లూరు - ప్రకాశం జిల్లాలు రెండింటిలోనూ మంచి పట్టున్న నేత అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తమతో కలుపుకుని వెళ్లే దిశగా జగన్ చేసిన యత్నాలు దాదాపుగా ఫలించాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో మరో సీనియర్ నేతగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు జగన్ చేసిన యత్నాలు కూడా ఫలించాయనే తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని కాస్తంత ముందుగానే పసిగట్టిన టీడీపీ... కొంత అసంతృప్తి రేకెత్తినా ఫరవా లేదు... ఆదాల పార్టీ వీడకుండా చూసుకోవాలన్న దిశగా కదిలింది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ టికెట్ ను ఆదాలకు కేటాయిస్తున్నట్లుగా లీకులిచ్చేసింది. అయినా కూడా ఆదాల పార్టీలో నిలిచే అవకాశాలు కనిపించడం లేదట.

తాను సర్వేపల్లి లేదంటే కొవ్వూరు టికెట్లను అడిగానని - అయితే వాటిలో ఏ ఒక్కటినీ ఖరారు చేయకుండా... తాను అడగని నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వడమేమిటని ఆదాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయినా తనకు ఇష్టమైన టికెట్ ను ఇవ్వకుండా... అడగని టికెట్ ను కేటాయించడమంటే ఏమిటర్థమని కూడా ఆదాల ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా సీటు కేటాయించినా... ఆదాలను సంతృప్తిపరచలేకపోయామే అన్న కోణంలో ఇప్పుడు టీడీపీ తల పట్టుకుందట. మరోవైపు టీడీపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేలోగానే ఆదాల టీడీపీని వీడటం ఖాయమేనన్న వార్తలు వినిస్తున్నాయి. అంతేకాకుండా ఓడిపోయే టీడీపీలో ఉండటం ఇష్టం లేకే... సీటిచ్చినా కూడా ఆ పార్టీలో కొనసాగేందుకు ఆదాల ఇష్టపడటం లేదన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.