Begin typing your search above and press return to search.

బాబు - జ‌గ‌న్‌ ఏం చేయాలో చెప్తున్న ఏపీ నేత‌లు

By:  Tupaki Desk   |   21 Jan 2018 4:36 PM GMT
బాబు - జ‌గ‌న్‌ ఏం చేయాలో చెప్తున్న ఏపీ నేత‌లు
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని బీజేపీ అన్యాయం చేస్తోందని ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ - సినీన‌టుడు శివాజీ - సీపీఐ ఏపీ నేత రామ‌కృష్ణ ఆరోపించారు. ఈ విష‌యంలో ప్ర‌శ్నించాల్సిన అధికార‌ - ప్ర‌తిప‌క్ష పార్టీలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉన్నాయ‌న్నారు. ఆ రెండు నేత‌లు నారా చంద్రబాబు నాయుడు - వైఎస్ జ‌గ‌న్‌ లు తిట్టుకోవడానికే సమయం సరిపోతుందని - ఇక వాళ్లు బీజేపీని ప్రత్యేక హోదా కోసం ఎక్కడ నిలదీస్తారని ఎద్దేవా చేశారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర - ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు.

రాష్ట్ర విభజన హామీలను వెంటనే అమలు చేయాలని తాము పోరాటం చేస్తున్నామ‌ని ఈ ముగ్గురు నేత‌లు తెలిపారు. ఇందుకోసం బస్సుయాత్రలు - ఆమరణదీక్షలు చేపట్టామని - కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. చంద్రబాబు - జగన్‌ లు నిత్యం పరస్పరం తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప - ఈ విషయమై ప్రధాని మోడీని - బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాని నిలదీయడం లేదని చలసాని శ్రీనివాస్ - మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ ఆర్‌ సీపీ అధినేత జగన్‌ - జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ప్రధాని మోడీని ఎందుకు నిల‌దీయ‌డం లేదని చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌ ప్రశ్నించారు. ఇద్దరు సభ్యులతో నాడు కేసీఆర్‌ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారని - కాని ఏపిలో 36 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాదించుకోలేకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోడీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు బడ్జెట్‌ కేటాయిస్తూ తెలుగు రాష్ట్రాలకు మొండి చేయిచూపుతున్నారని, రైల్వే బడ్జెట్‌ లో సైతం ఇరు రాష్ట్రాలకు న్యాయం దక్కలేదన్నారు. గుంటూరుకు చెందిన మంత్రులు - ఎమ్మెల్యేలకు మాత్రం డబ్బుపై ఉన్న ప్రేమ సొంత ప్రాంతంపై లేదన్నారు.

ఏపీలో పట్టిసీమ తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమి లేదని సినీ న‌టుడు శివాజి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై వెంటనే అఖిలపక్షం వేయాలని కోరుతూ ప్రధాన మంత్రి అపాయింట్‌ మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఒక్క సంవత్సరం దానిపై దృష్టిసారిస్తే సాదించుకునే అవకాశం ఉందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా 10వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగుపడుతారని తెలిపారు. ఏపీ మాకు పోటీ కాదని సీఎం కేసీఆర్‌ మాటలు తమను బాధకలిగించాయన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓడిషా - కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకు బీజేపీకి ఓటువేయవద్దని పిలుపునిచ్చారు.

సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ ఏపీ ప్రజలను మోసం చేయడానికే సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్తానని అంటున్నారని, ఏన్డీఏ నుంచి బయటకు వచ్చి కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు - ముఖ్యమంత్రి బాబు ఇద్దరూ రాష్ట్రానికి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు అప్పు ఇస్తుందని - రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఇస్తుందని అన్నారు. వెంటనే అఖిలపక్షాన్ని వేసి ప్రత్యేక హోదాపై స్పష్టమైన నిర్ణయం తెలుపాలని కోరారు.