Begin typing your search above and press return to search.

చాలెంజ్ ఫిట్ నెస్ పై కాదు..ప్రజాసమస్యలపై మోడీజీ..

By:  Tupaki Desk   |   24 May 2018 8:40 AM GMT
చాలెంజ్ ఫిట్ నెస్ పై కాదు..ప్రజాసమస్యలపై మోడీజీ..
X
కేంద్ర క్రీడల శాఖమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ విసిరిన ఓ కొత్త చాలెంజ్ క్రీడాస్ఫూర్తిని దాటి రాజకీయ రంగు పులుముకుంది. క్రీడామంత్రి మొదట తాను పలు వ్యాయామాలు చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా షట్లర్ సైనా నెహ్వాల్, హీరో హృతిక్ రోషన్ లకు ‘ఫిట్ నెస్ చాలెంజ్’ను చేశాడు. సైనా నెహ్వాల్ ఈ చాలెంజ్ ను స్వీకరించి బరువులు ఎత్తుతున్న వీడియోను పోస్టు చేసింది.

క్రీడల మంత్రి చాలెంజ్ కు రియాక్ట్ అయిన కోహ్లీ కూడా జిమ్ లో తాను పలు ఎక్సర్ సైజ్ లు చేసి ఆ వీడియోను షేర్ చేశాడు. తాను ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించానని.. ప్రధాని మోడీ - భార్య అనుష్క - సహచర క్రికెటర్ ధోనిలకు ఈ చాలెంజ్ విసిరాడు.. కోహ్లీ చాలెంజ్ ను స్వీకరించిన ప్రధాని మోడీ కూడా తాజాగా త్వరలోనే ఈ ఫిట్ నెస్ వీడియో పోస్టు చేస్తానని ట్విట్టర్ లో పేర్కొనడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. కోహ్లీ చాలెంజ్ కు ప్రధాని స్పందించడంపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి - లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. విరాట్ సవాల్ కు స్వీకరించిన మోడీకి.. తాను ఓ సవాల్ చేస్తున్నానని.. దాన్ని స్వీకరించగలిగే దమ్ముందా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘విరాట్ సవాల్ స్వీకరించడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు.. యువతకు ఉద్యోగాల కల్పన - రైతులకు ఉపశమనం.. - దళితులు - మైనార్టీలపై హింసను రూపుమాపేలా కార్యాచరణ తీసుకురావాలని.. ఈ నా సవాల్ ను స్వీకరించాలని ’ మోడీని తేజస్వీ కోరారు.

ఇలా ఎంటర్ టైన్ మెంట్ కోసం - బాడీ ఫిట్ నెస్ పై అవగాహన కోసం మొదలైన ‘ఫిట్ నెస్ ’ చాలెంజ్ రాజకీయ రంగు పులుముకుంది. కోహ్లీ చాలెంజ్ కు స్పందించిన మోడీకి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చాడు బీహార్ నేత.. ఇప్పుడీ రాజకీయ చాలెంజ్ పై ఎటూ తేల్చుకోలేక ప్రధాని ఇరుక్కుపోయారు. ఎలా స్పందించాలో తెలియక.. స్పందిస్తే ఏం జరుగుతుందో అర్థం కాక అడకత్తెరలో పోకచక్కలా మారిపోయాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అనవసరంగా ప్రధాని ఈ చాలెంజ్ ల్లో పాల్గొని తన గోతిని తనే తవ్వుకున్నాడంటున్నారు.. చూడాలి మరి ప్రజాసమస్యలపై ప్రధాని సవాల్ ను స్వీకరిస్తారా లేదా మౌనంగానే అవైడ్ చేస్తాడా అన్నది..