చనిపోయిన ఏడాది నిర్దోషిగా తేలిన తెల్గీ

Tue Jan 01 2019 12:04:46 GMT+0530 (IST)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోట్ల రూపాయ ల నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ సహా ఏడుగురు నిందితులను మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. అయితే గత ఏడాది అక్టోబర్ 23న బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో తెల్గీ మృతిచెందాడు. బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతూ అతను ప్రాణాలు విడిచాడు. అయితే అతను మృతిచెందిన ఏడాది తర్వాత.. స్టాంప్ పేపర్ల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చారు. అతనితో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేని కోర్టు పేర్కొన్నది. నకిలీ స్టాంప్ పేపర్లు తెల్గీ సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో అతను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ గత ఏడాది హాస్పటల్లో చనిపోయాడు. 2007లో కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. అతనికి కఠిన జైలు శిక్షతోపాటు 202 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.రైల్వే ఉద్యోగి కుమారుడైన తెల్గీ.. కర్ణాటకలో ని బెల్గావీ జిల్లా ఖానాపూర్ వాసి. ఆయనకు భార్య - కూతురు - అల్లుడు ఉన్నారు. బీకాం పట్టభద్రుడైన తెల్గీ కూరగాయల వ్యాపారిగా - రైళ్లలో ఫలాల వ్యాపారిగా పని చేసిన తర్వాత సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఏడేళ్ల తర్వాత ముంబైకి వచ్చాక చీటింగ్ కేసులో 1991లో అరెస్టయ్యారు. 1994లో స్టాంప్ వెండర్ లైసె న్సు పొందిన తెల్గీ నాసిక్ లోని సెక్యూరిటీ ప్రెస్ - మహారాష్ట్ర రెవెన్యూశాఖ అధికారులతో సత్సంబంధాలు నెలకొల్పుకుని.. అదే ప్రెస్ నుంచి స్టాంప్ పేపర్లు ముద్రించే రంగు తన వద్దకు తెచ్చుకుని నకిలీ స్టాంప్ పేపర్లు ముద్రించి.. 350 మంది ఏజెంట్లతో యథేచ్చగా వాటిని విక్రయించాడు. 2000లో బెంగళూరులో నకిలీ స్టాంప్ పేపర్లు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో అసలు సంగతి బయట పడింది. ఈ కుంభకోణంతో తెల్గీ రూ.20 వేల కోట్లు సంపాదించి ఉంటాడని దర్యాప్తు సంస్థలు అంచనా వేశాయి.