Begin typing your search above and press return to search.

కలాం ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉన్నారు

By:  Tupaki Desk   |   29 July 2015 4:29 AM GMT
కలాం ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉన్నారు
X
మహా మనీషి.. మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉన్న భారతావని.. కలాం గురించే మాట్లాడుకుంటోంది. అనుక్షణం కొంగొత్త విషయాల్ని ప్రస్తావిస్తూ ఉండే సోషల్ నెట్ వర్క్స్ సైతం.. సోమవారం రాత్రి 8 గంటల నుంచి పూర్తిగా మారిపోయింది. కలాం తప్పించి మరో ఊసు లేని పరిస్థితి.

ఈ సందర్భంగా ఫేస్ బుక్.. ట్విట్టర్ అకౌంట్లలో ఆసక్తికరమైన ఎన్నోపోస్టింగులు నమోదవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక పోస్టింగ్ విషయానికి వస్తే.. కలాం తర్వాత రాష్ట్రపతిగా పని చేసిన.. ప్రస్తుతం పని చేస్తున్నవారి పేర్లను గూగుల్ సెర్చ్ బార్ లో నమోదు చేసిన వెంటనే వచ్చే వివరాలు.. కలాం పేరును సెర్చ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇమేజ్ ను చూపిస్తూ.. కలాం ఎంత గొప్ప వ్యక్తి అన్న విషయాన్ని సాక్ష్యాలతో ప్రస్తావిస్తున్నారు.

అత్యున్నత స్థానాల్లోకి చేరిన వెంటనే.. అయిన వారికి.. సన్నిహితులు.. బంధువుల్ని తీసుకొచ్చి నెత్తినపెట్టుకునే నేతలకు భిన్నమైన వ్యక్తిత్వం కలామ్ ది. దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉన్నా.. ఆయన తన హోదాను ఏనాడు దుర్వినియోగం చేసింది లేదు. ఒక రాష్ట్ర మంత్రిగా పదవిని చేపట్టిన వెంటనే.. వారి స్థితిగతులు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి.. అయిన వారి ఎంత రాజసం చెలాయిస్తారన్నది తెలిసిందే.

వీటన్నింటికి భిన్నంగా ఉంటుంది కలాం కుటుంబం. కావాలంటే.. ఆ కుటుంబాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. అసలు విషయాలు ఇట్టే అర్థమైపోతాయి. దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన తనకు.. తన బాగోగులన్నీ ప్రభుత్వమే చూసుకుంటున్న విషయం తెలిసిన మరుక్షణమే.. ఆయన జీవితకాలంలో సంపాదించిందంతా ‘‘పురు’’ అనే ధార్మిక సంస్థకు రాసిచ్చేవారు. తన అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంటే.. ఇక తన ఆస్తి.. జీతంతోపనేమిటని ఆయన వ్యాఖ్యానించేవారు.

ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే.. అవివాహితుడైన కలాంకు.. రామేశ్వరంలో ఉన్న కలాం హౌస్.. ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. అన్నదమ్ములు అందరిలోకి చిన్నవాడు కలాం. వీరిలో అందరికంటే పెద్దవాడు ముత్తు మీరన్ లాభాయ్.. ఆయన వయసు ప్రస్తుతం 99 ఏళ్లు.. కలాంలో మగపిల్లల కంటే పెద్దదైన సోదరి ఇప్పటికే కాలం చేశారు. ఇక.. కలాం సోమవారం సాయత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే.

కలాం అన్నదమ్ములంతా సాదాసీదా జీవితాన్నే గడుపుతుండటం గమనార్హం. కలాం పెద్దన్న మరికార్ కొద్దికాలం కిందట వరకూ.. చెట్లనుపెంచుతూ ఉండేవారు. పశుపోషణ చేపట్టేవారు. మరికార్ కుమారుడు రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మరో సోదరుడి కుమార్తె ఆషికా బేగం సైతం రామేశ్వరంలోనే ఉంటారు. ఆమె భర్త ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుంటారు. కలాం సోదరుల పిల్లలు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. వారంతా రామేశ్వరానికి దగ్గర ఊళ్లల్లోనే ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారెవరూ కూడా కలాం తమకు ఏమీ ఇవ్వలేదన్న బాధను అస్సలు వ్యక్తం చేయరు. కలాం కీర్తి మొత్తం తమ ఆస్తే అని సగర్వంగా చాటుతుంటారు.