ఆరుషి హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు

Thu Oct 12 2017 16:09:36 GMT+0530 (IST)

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి.. భారీ చర్చకు తెర తీసిన ఆరుషి కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.  ఆరుషిని హత్య చేసిన ఉదంతంలో ఇప్పటివరకూ వారి తల్లిదండ్రులే ఆమెను హత్య చేయించారన్న వాదనను నమ్మి జీవితఖైదు విధించినవారి తల్లిదండ్రుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. దీంతో.. ఇంతకాలం ఈ కేసుకు సంబంధించిన అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న ఉత్కంఠ తీరినట్లైంది.ఆరుషి హత్య కేసులో వారి తల్లిదండ్రులే దోషులుగా పేర్కొంటూ కింది కోర్టులు నిర్ధారించగా.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తాజాగా హైకోర్టు కేసును కొట్టివేసింది. ఈ కేసు మీద ఇప్పటికే పలు పుస్తకాలు.. బాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. అందులో ఆరుషి తల్లిదండ్రులు అమాయకులన్నట్లుగా ప్రస్తావించటం గమనార్హం. ఈ సంచలన కేసుకు సంబంధించిన అంశాల్ని వరుసగా చూస్తే..

= 2008లో ఢిల్లీలోని నోయిడాలోని 14 ఏళ్ల టీనేజర్ ఆరుషి తల్వార్ హత్యకు గురైంది. సర్జికల్ ఉపకరణాలతో ఆమెను కిరాతకంగా గొంతు కోసేశారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆ ఇంటి పనిమనిషి హేమ్ రాజ్ కూడా హత్యకు గురయ్యారు. అతడి మృతదేహం ఆ ఇంటి టెర్రస్ మీదనే కనిపించింది. ఈ రెండు హత్యలకు కారణంగా ఆరుషి తల్లిదండ్రులుగా పేర్కొనటం.. అందుకు తగ్గట్లే కింది కోర్టులు సైతం తీర్పును ప్రకటించాయి.

= ఇంటి పనిమనిషి హేమంత్ తో తమ కుమార్తె సన్నిహితంగా ఉండటాన్ని చూసిన వారి తల్లిదండ్రులు పరువుకు భంగం వాటిల్లినట్లుగా భావించి హత్య చేసి ఉంటారన్న భావన వ్యక్తమైంది. అయితే.. ఆరుషిని.. హేమంత్ను హత్య చేసింది వారి తల్లిదండ్రులేనన్న విషయాన్ని పోలీసులు.. సీబీఐ కానీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు.

= ఆరుషి తల్లిదండ్రులు దంతవైద్యులు. ఒకదశలో వారికి నార్కో టెస్ట్లు కూడా నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు ఏ దశలోనూ తమ వాదనకు తగ్గ ఆధారాల్ని సంపాదించలేకపోయారు.

= తొలుత ఈ కేసు పోలీసులు విచారించగా.. వారి విచారణపై విమర్శలు రావటంతో దీన్ని సీబీఐకి అప్పగించారు. అయితే.. ఆరుషి.. హేమంత్ హత్యలు దంపతుల అసిస్టెంట్ కృష్ణ.. మరో ఇద్దరు పనివాళ్ల సాయంతో చేసి ఉంటారని భావించింది. అయితే.. అందుకు సంబంధించిన ఆధారాల్ని సాధించలేకపోయారు.
 
= నేరం జరిగిన పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఆరుషి తండ్రి రాజేష్ను ప్రధాన అనుమానితుడిగా పేర్కొన్నారు. అయితే.. అందుకు తగ్గ ఆధారాల్ని మాత్రం చూపించలేకపోయారు.అయినప్పటికీ నేరారోపణల కింద ఈ డాక్టర్ దంపతులు ఇద్దరిని కొంతకాలం జైల్లో ఉంచారు. పలు సందర్భాల్లో బెయిల్ మంజూరైనప్పటికీ.. తుదకు కిందికోర్టు విధించిన జీవితకాల శిక్ష నేపథ్యంలో ప్రస్తుతం వారు  ఘజియాబాద్ లోని దాస్నా జైల్లో ఉన్నారు.

= ఆరుషి హత్య కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఏదైనా నేరం జరిగిందని ఆరోపించినప్పుడు.. అందుకు సాక్ష్యంగా పోలీసులు కానీ.. విచారణ సంస్థలు కానీ ఆధారాల్ని కోర్టుకు అందజేస్తారు. కానీ.. ఈ కేసులో మాత్రం తాము నిర్దోషులమని ఆరుషి తల్లిదండ్రులే నిరూపించుకోవాలంటూ సీబీఐ కోర్టు వ్యవహరించిన తీరును న్యాయనిపుణులు పలువురు తీవ్రంగా తప్పు పట్టారు.

= హత్య జరిగిన ఐదేళ్లకు ఉత్తరప్రదేశ్ కోర్టు ఆరుషి తల్లిదండ్రుల్ని దోషులుగా పేర్కొంటూ జీవితఖైదు విధించారు. అనంతరం ఈ తీర్పుపై అప్పీలు చేసుకున్నారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ బీకే నారాయణ.. జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబరులో ఈ కేసును విచారించి తీర్పును రిజర్వ్ చేసింది.

= ఈ మధ్యహ్నాం (గురువారం) 3 గంటల సమయంలో కోర్టు తీర్పునిస్తూ.. ఆరుషి తల్లిదండ్రుల్ని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఆరుషి తల్లిదండ్రుల్ని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

= గడిచిన పదేళ్లలో అంతుచిక్కని హత్య కేసుగా ఆరుషి.. హేమరాజ్ మర్డర్లు నిలిచాయని చెప్పాలి.