కండీషన్స్ అప్లై: ఆధార్ తో లింక్ మార్చి 31!

Thu Dec 07 2017 16:17:51 GMT+0530 (IST)

మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేశారా?మీ క్రెడిట్ కార్డును ఆధార్ తో లింక్ అయ్యిందా?

ఇలా నిత్యం మెసేజ్ ల మీద మెసేజ్ లు వస్తూనే ఉన్నాయా? అలా ఆధార్ తో లింక్ చేయటానికి ఈ డిసెంబరు 31 వరకు మాత్రమే గడువు ఉందంటూ హెచ్చరికలు అందుతున్నాయా? అయితే.. అలాంటి వాటికి చెక్ పడనుంది. బ్యాంక్ తో పాటు.. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. సేవల కోసం ఆధార్ నంబరుతో అనుసంధానం చేసే గడువును డిసెంబరు 31 నుంచి మార్చి 31కు మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

అయితే.. ఇలాంటి అవకాశం అందరికి కాదండోయ్. ఆధార్ నెంబరు ఇప్పటివరకూ పొందని వారికి మాత్రమే. అంటే.. ఇప్పటికే ఆధార్ నెంబరు ఉన్న వారు మాత్రం ఎప్పటి మాదిరి ఈ నెల 31 నాటికి లింక్ చేసి ఉండాల్సిందే. ఆధార్ నంబరు అనుసంధానంపై వచ్చిన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఆధార్ అనుసంధానంపై స్టే ఇవ్వాలంటూ పిటిషనర్లు కోరిన నేపథ్యంలో ఇప్పటివరకూ ఉన్న డిసెంబరు 31 గడువు తేదీని మార్చి 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ అవకాశం ఇప్పటివరకూ ఆధార్ నంబరు లేని వారి కోసం మాత్రమేనని వెల్లడించింది. మిగిలిన వారు మాత్రం ఈ నెల 31 లోపు ఆధార్ తో తమ ఖాతాల్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.