Begin typing your search above and press return to search.

న‌గ‌దు కొర‌త‌పై జైట్లీ ట్వీట్..నెటిజ‌న్ల ఫైర్!

By:  Tupaki Desk   |   17 April 2018 10:31 AM GMT
న‌గ‌దు కొర‌త‌పై జైట్లీ ట్వీట్..నెటిజ‌న్ల ఫైర్!
X
కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా తీవ్రంగా నగదు కొర‌త ఏర్ప‌డిన సంగతి తెలిసిందే. ఓ ప‌క్క న‌గ‌దు లేక ఏటీఎంలు వెల‌వెలబోతోంటే....మ‌రో ప‌క్క డ‌బ్బు దొరికే అర‌కొర ఏటీఎంల వ‌ద్ద జ‌నాలు కిలోమీట‌ర్ల వ‌ర‌కు బారులు తీరుతున్నారు. దేశంలోని చాలా చోట్లు దాదాపుగా ...పెద్ద నోట్ల ర‌ద్దు నాటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. కొన్ని చోట్ల జ‌నాలు....పెళ్లి కార్డులు చూపించి డ‌బ్బులు డ్రా చేసుకునే దారుణ‌మైన ప‌రిస్థితులు మళ్లీ వ‌చ్చాయి. అయితే, ఈ నేప‌థ్యంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ...ఏటీఎంలు - బ్యాంకుల్లో న‌గ‌దు కొర‌తపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే న‌గ‌దు కొర‌త ఉంద‌ని,....అది కూడా అక్క‌డ అనూహ్యంగా డ‌బ్బుకు డిమాండ్ పెర‌గ‌డంతో తాత్కాలిక కొర‌త ఏర్ప‌డింద‌ని జైట్లీ ట్వీట్ చేశారు. ఏటీఎంల‌లో డ‌బ్బులు లేక నానా తిప్ప‌లు ప‌డుతున్న స‌మ‌యంలో జైట్లీ చేసిన ట్వీట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దేశంలో నగదు కొరతపై జైట్లీ స్పందించారు. అస‌లు దేశంలో న‌గ‌దు కొర‌తే లేద‌న్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. ``దేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. దేశం మొత్తం మీద అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద కూడా నగదు అందుబాటులో ఉంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి న‌గ‌దుకు అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. వెంటనే దీన్ని పరిష్కరించాం`` అని జైట్లీ ట్వీట్ చేశారు. మ‌రోవైపు దేశంలో నగదు లభ్యతను పరిశీలించేందుకు ఆర్ బీఐ ఈ రోజు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. ఆర్బీఐ ద‌గ్గ‌ర స‌రిపడినంత న‌గ‌దు ఉంద‌ని - అసాధార‌ణ డిమాండ్ కు త‌గ్గ‌ట్లు న‌గ‌దు స‌ర‌ఫరా చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది. ఏపీ - తెలంగాణ - బిహార్ - కర్ణాటక - మహారాష్ట్ర - రాజస్థాన్ - యూపీ - మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదు కంటే ఉపసంహరణలు ఎక్కువ కావ‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే, అరుణ్ జైట్లీ ట్వీట్ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇవే ప‌రిస్థితులున్నాయ‌ని, కానీ జైట్లీకి మాత్రం అవి క‌నిపించ‌డం లేద‌ని ఎద్దేవా చేస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి రిజర్వు బ్యాంకుకు, ప్రభుత్వానికి నగదు కొరతపై ఫిర్యాదులు అందుతున్నా....జైట్లీకి ప‌ట్ట‌డం లేద‌ని మండిప‌డుతున్నారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఏటీఎంల వద్ద జనాలు గంటల తరబడిబారులు తీరిన‌ట్లు....ఇపుడు కూడా నిలుచున్నార‌ని...అవి జైట్లీకి క‌న‌బ‌డ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నగదు కోసం పెళ్లి కార్డులను తీసుకువెళ్లి బ్యాంకు అధికారులను అభ్యర్థిస్తున్న ప‌రిస్థితులున్నాయ‌ని మండిప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నెల రోజుల నుంచి ఉంద‌ని, ఇపుడు జైట్లీ తాపీగా స్పందించ‌డం ఏమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.