Begin typing your search above and press return to search.

బాబుకు భ‌లే తీపి క‌బురు

By:  Tupaki Desk   |   4 Oct 2015 7:12 AM GMT
బాబుకు భ‌లే తీపి క‌బురు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తికి వైభ‌వం తేవ‌డంలో మ‌రో కీల‌క అడుగు ప‌డింది. రాజ‌ధానిలో వ్య‌వహారాల్లో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాల‌న‌లో కీల‌క పాత్ర పోషించే ఏపీ ఉద్యోగులు అమ‌రావ‌తికి త‌ర‌ళివెళ్లేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేర‌కు ప్రాథ‌మిక చర్చ‌లు పూర్త‌య్యాయి. 2017 జూన్‌ 2వ తేదీ లోపు ఉద్యోగులు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు తరలివస్తే వారికి ఏపీ స్థానిక‌త క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు ప్రభుత్వం తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఏపీ సర్కార్‌ తెలంగాణలో ఉద్యోగులకు విధించిన స్థానికత గడువుపై సచివాలయ ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. రాజధానికి తరలివచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యోగ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో చంద్ర‌బాబును కలుసుకున్నారు. కొన్ని అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన వారు ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తికి త‌ర‌లిరావ‌డంపైనా చ‌ర్చించారు.

ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తే తాము తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సంద‌ర్భంగా ప్రకటించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే తరలివస్తామని, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామన్నారు. అయితే తరలింపులో కొన్ని చిక్కుముడులు వీడాల్సి ఉందని అన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీతో పాటు రాజధాని ప్రాంతంలో నివేశన స్థలాలు, ఇళ్లను కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్న విషయమై సీఎంతో చర్చించాలని నిర్ణయించారు. వివిధ ప్రభుత్వశాఖల సమీక్షలో తలమునకలై ఉన్న నేపథ్యంలో వారం, పదిరోజుల్లో సావధానంగా చర్చించుకుందామని బాబు వారికి తెలిపారు. దీంతో మ‌రో పదిరోజుల తరువాత మరోసారి బాబుతో వారు భేటీ కానున్నారు.

సీడ్‌ కాపిటల్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు సచివాలయ ఉద్యోగులు తరలివచ్చే అవకాశాలులేవని వాదనకు ఉద్యోగుల అంగీకారం చెక్ పెట్టిన‌ట్ల‌యింది. అయితే గృహ నిర్మాణాలతో పాటు కార్యాలయాల నిర్మాణాలు జరిగితేనే సచివాలయ ఉద్యోగులకు విధులు నిర్వహించే వీలు కలుగుతుందని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మిగిలిన ప్రభుత్వ విభాగాల మాదిరిగా ఓ విభాగాన్ని తరలించి మరో విభాగాన్ని హైదరాబాద్‌ లో కొనసాగించేందుకు వీలులేదని, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగిన అనంతరం ప్రభుత్వం స్పష్టత ప్రకటిస్తే తరలివచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరంలేదని ఉద్యోగులు స్ప‌ష్టం చేస్తున్నారు.