అనంతలోకాలకు వెళ్లిపోయిన 108 సృష్టికర్త!

Mon Apr 16 2018 10:18:42 GMT+0530 (IST)

ఒక ఆలోచన కోట్లాది మందికి సాయంగా నిలుస్తుంది. లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతుంది. దేశీయంగా ప్రభుత్వాలు ఏం చేసినా చేయకున్నా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అలాంటి అవసరాన్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమానికి తెర తీసి కోట్లాది మందికి సాయంగా నిలవటమే కాదు.. ఆయన స్టార్ట్ చేసిన కార్యక్రమం ఈ రోజున దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేసే పరిస్థితి.వైఎస్ పాలనలో బోలెడన్ని కితాబులు ఆయనకు అందేలా చేసిన కార్యక్రమంలో ముఖ్యమైంది 108. 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్ తన సర్కారు అందించే 108 సేవల గురించి పదే పదే ప్రస్తావించటానికి కారణం ప్రజల్లో ఆ కార్యక్రమానికి ఉన్న ఆదరణే. వైఎస్ స్టార్ట్ చేసిన 108 అంబులెన్స్ సేవల ఆలోచన మాత్రం ప్రముఖ వైద్యుడు అయితరాజు పాండురంగారావుదే. ఆపదలో ఉన్న వారు ఎవరైనా సరే..వారికి తక్షణ వైద్యసాయం అందాలని.. వారిని ఆసుపత్రికి చేరవేయాలన్న ఆలోచనకు ప్రతిరూపమే 108 అంబులెన్స్ లు.

తన ఆలోచనను వైఎస్ కు చేరవేయటం.. దానికి ఆయన ఓకే అంటూ స్టార్ట్ చేయటంతో ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ సేవల్ని అన్ని రాష్ట్రాలు అందిస్తున్నాయి. అలాంటి ఆయన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు భార్య.. కుమారుడు ఉన్నారు.

హైదరాబాద్ లో పేరున్న జనరల్ ఫిజిషియన్లలో ఒకరిగా చెప్పే డాక్టర్ రంగారావు స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం. 1965లో ఓయూలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన తొలుత కొంతకాలం ఖమ్మం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పని చేశారు.

ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థల సహకారంతో 108 ఆతర్వాత 104 సేవల్ని విజయవంతంగా నడిపేలా చేసిన ఆయన ఆలోచనకు కేంద్రం సైతం ఫిదా అయ్యింది. ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట శశ్మాన వాటికలో జరిగాయి. అపద ముంచుకొచ్చినప్పుడు.. అత్యవసర వైద్యసేవలు అవసరమైనప్పుడు పిలిచినంతనే కుయ్.. కుయ్ అంటూ వచ్చే 108 అంబులెన్స్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన పెద్ద మనిషిని స్మరించుకోవటం కనీస ధర్మం. అవును కదా?